ఒక డెవల్మెంట్ గురించి చెప్పుకోవాలంటే గతం నుంచి వర్తమానానికి పోలుస్తం! భవిష్యత్‌కు తగిన ప్రణాళిక వేసుకొని ముందుకుసాగుతం! కానీ, కాంగ్రెస్ పాలనలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది! దశాబ్దాల సాగునీటి గోసను స్వరాష్ట్రంలో తీర్చుకొని జలసిరులతో సుభిక్షంవైపు పయనిస్తే.. ఇప్పుడు మళ్లీ సాగునీటి సమస్య మొదలై పదేండ్ల కిందటి రోజులను గుర్తు చేసుకోవాల్సి వస్తున్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరువు కోరల్లో చిక్కింది. మొన్నటిదాకా జలసిరులతో కళకళలాడిన ప్రాంతం, ఇప్పుడు కాంగ్రెస్ వందరోజుల పాలనలో సాగునీటి కోసం అల్లాడిపోతున్నది. ఎస్సారెస్పీతోపాటు మిడ్‌మానేరు, ఎల్ఎండీ, ఎల్లంపల్లి లాంటి ప్రధాన జలాశయాలు ఉన్నా చుక్క నీరు రాక పంటలన్నీ ఎండిపోతుండగా, రైతుకు కన్నీరే మిగులుతున్నది. ‘ఏ ఊళ్లో చూసినా ఎండని చేను లేదు.. ఏడ్వని రైతు లేడు’ అన్నచందంగా పరిస్థితి తయారైంది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంట ఎండిపోగా, ప్రభుత్వం నుంచి స్పందన లేక రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇది ప్రకృతి ఇచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువేనని మండిపడుతున్నారు. వందరోజుల పాలనలోనే పదేండ్ల కాలం వెనక్కిపోయిందని విలపిస్తూ, తమను ఆదుకునే వారి కోసం దీనంగా చూస్తున్నారు. ఈ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని చెబుతున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని, ఏ కష్టం వచ్చినా కేసీఆర్ తమకు అండగా నిలిచారని గుర్తు చేస్తున్నారు.
– కరీంనగర్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ)
కేసీఆర్ పాలనలో ఉమ్మడి జిల్లా జలవనరులతో కళకళలాడింది. పదేళ్లపాటు సాగునీటికి రంది లేకుండా పోయింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వచ్చిన తర్వాత కాలంతో సంబంధం లేకుండా గోదావరి జలాలు పరుగులు తీశాయి. లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ బరాజ్‌లు, ఎల్లంపల్లి, నంది, ఎగువమానేరు, మిడ్‌మానేరు, దిగువమానేరు, అన్నపూర్ణ జలాశయాలకు తోడు చెరువులు, కుంటలు జలకళలాడాయి. పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోయడంతో మండుటెండల్లోనూ జలసిరులు పరవళ్లు తొక్కాయి. మెట్టప్రాంతాన్ని సుభిక్షంగా మార్చాయి. నాడు వట్టిపోయిన వరదకాలువ జీవం పోయడమే కాదు, కాకతీయ కాలువ గుండా పరుగులు తీశాయి. చరిత్రలోనే మొదటిసారిగా 146 రోజులపాటు ప్రవహించి ఎస్సారెస్పీ ఆయకట్టు చివరి భూములనూ తడిపాయి. పుష్కలంగా నీరు రావడం, బీఆర్ఎస్ సర్కారు ప్రోత్సాహం అందించడంతో రైతులు పోటీపడి మరీ సాగు చేశారు. రెండు సీజన్లలోనూ బంగారంలాంటి పంటలు పండించారు. ఉమ్మడి జిల్లాను సీడ్‌బౌల్ ఆఫ్‌గా తెలంగాణ మార్చారు.
కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అంతా తారుమారైంది. కేసీఆర్ పాలనలో సుభిక్షంగా మారిన ఉమ్మడి జిల్లా, ఇప్పుడు కరువు కోరల్లో చిక్కుకున్నది. పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా సాగునీటి సమస్య మొదలైంది. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు వెలవెలబోతుండగా.. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టులో పరిస్థితి దయనీయంగా ఉన్నది. నిరుడు మాదిరిగానే ఈ యాసంగిలోనూ నీళ్లు వస్తాయని నమ్మిన రైతులు ఇప్పుడు నిండా మునగాల్సిన దుస్థితి వచ్చింది. కాలువల ద్వారా నీళ్లు రాక, కాళేశ్వరం జలాలు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. నోటికాడి బుక్కను ఎత్తగొట్టినట్టు.. చేతికొచ్చే సమయంలో నీళ్లివ్వకపోవడంతో పొలాలు దెబ్బతింటున్నాయి. ఎక్కడా చూసినా రైతులు సాగునీటి కోసం తండ్లాడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి.
చొప్పదండి, కరీంనగర్, మంథని నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల్లో పంటలు ఎండిపోయాయి. కండ్లముందే ఎండుతున్నా కన్నీళ్లు కార్చడం మినహా ఏమీ చేయలేని దుస్థితి. అటు వరద కాలువకు నీళ్లివ్వాలని రైతులు ఆందోళనకు దిగితే తప్పా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించ లేదు. గంగాధర, మల్యాల, రామగుడు, బోయినపల్లి తదితర మండ లాల్లో 60 శాతం పంటలు ఎండిన తర్వాత వరద కాలువకు కంటి తుడుపుగా 0.1 టీఎంసీ నీటిని విడుదల చేశారు. ఈ నీళ్లు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఈ ప్రాంత రైతులు ఆవేదన చెందుతున్నారు. సకాలంలో నీటిని విడుదల చేస్తే కనీసం భూగర్భ జలాలు పెరిగి ఉన్న పంటలనైనా కాపాడుకునే అవకాశం ఉండేదని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యహరించి తమకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని వాపోతున్నారు.
సాగునీరు రాక ఎక్కడికక్కడ పంటలు ఎండుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘మీరు పంటలు వేసుకోండి. మేం నీళ్లిస్తాం’ అని ఎన్నికల ముందు ఆ పార్టీ చెప్పిన మాటలను నమ్మి మోసపోయామని మండిపడుతున్నారు. సర్కారు తీరుకు నిరసనగా రోడ్డెక్కుతున్నా స్పందన లేదని వాపోతున్నారు. కాపాడుకునే దారి లేక పంటలను వదిలేస్తున్నామని ఆవేదనగా చెబుతున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువేనని ఆగ్రహిస్తున్నారు. పదేండ్లలో రాని కరువు, ఇప్పుడెందుకు వస్తదని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ పాలనలో ఏనాడూ సాగునీటికి ఇబ్బంది పడలేదని, రంది లేకుండా ఎవుసం చేసుకున్నామని గుర్తు చేస్తున్నారు. కానీ, కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అరిగోస పడుతున్నామని మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లు కుంగాయనే సాకును చూపడం సరికాదని సూచిస్తున్నారు. కక్ష పూరితంగా వ్యవహరించడం ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్ రూరల్ మండలంలో రైతులు సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా బావుల్లో పూడిక తీయిస్తూ కనిపిస్తున్నారు. గురువారం మొగ్దుంపూర్లోని వ్యవసాయ బావిలో ఇలా క్రేన్ సహాయంతో పూడిక తీయించారు.
మానేరు తీరాన ఉన్న మొగ్దుంపూర్ గడిచిన పదేళ్లలో పు ష్కలమైన పంటలు పండించింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డీ-93 పరిధిలోకి వచ్చే ఈ గ్రామంలో ఇపుడు 60 శాతానికిపైగా పంటలు ఎండిపోయాయి. కొందరు రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేసి మానేరువాగు నుంచి పైప్లైన్లు వేసుకున్నా.. వాగులో భూగర్భ జలాలు కూడా ఇంకుతుండడంతో పంటలను రక్షించుకునే మార్గాలు లేకుండా పోయాయి. డీ-93 కాలువ ద్వారా గతంలో 125 నుంచి 130 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేది. కానీ, ఈసారి రెండు సార్లు కంటి తుడుపుగా మాత్రమే ఇచ్చారు. ఇచ్చిన 90 నుంచి 95 క్యూసెక్కులు కాలువల పక్కన ఉన్న పొలాలకే సరిపోలేదని రైతులు వాపోతున్నా రు. ఇటు బావులు, బోర్లు కూడా ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పొట్ట దశలో ఉన్న పంటలను కా పాడుకోలేక బావురుమంటున్నారు. ఇంకో రెండు తడులు నీళ్లిస్తే తమ పంటలు దక్కేవని వాపోతున్నారు.
మాది మొగ్దుంపూర్. ఊళ్లే మొత్తం నాలుగెకురాలు నాటేసిన. అండ్ల కాలువ కింద మూడెకరాలు పోయింది. బాయి కింద ఏసిన ఎకరం ఎండుకానికి వస్తంది. రెండెకరాలు కౌలుకు వట్టిన. పెట్టువడి మునుగుడైతంది. కౌలు మీదవడే కాలమచ్చింది. మా ఊళ్లె అందరి పరిస్థితి ఇట్లనే ఉంది. మునుపు గిట్ల లేకుండె. నీళ్లు వద్దంటే అచ్చేది. ప్రాజెక్టుల్ల నీళ్లున్న సుత ఇవ్వలె. రైతులను గోసపెడితే సర్కారుకు మంచిదైతదా..?
– పొలగాని ఐలయ్య, మొగ్దుంపూర్
ప్రతి సంవత్సరం ఎస్సారెస్పీ కాల్వల ఫుల్లు నీళ్లు వచ్చేవి. పంటకు సరిపడా మిగిలినవి వాగులోకి వెళ్లేవి. బావులల్ల కూడా మస్తు నీళ్లుండేవి. ఈసారి నాలుగు ఎకరాలు వరి సాగు చేసిన. కాల్వల నీళ్లు సక్కగ రాక పంట వదులుకున్న. నీళ్లు లేక బాయిలల్ల కూడా ఊట లేదు. పూటిక తీసినా వచ్చెటట్టు లేవు. నాతోపాటు చాలా మంది రైతులు పంటనష్టపోయిన్రు. ఎకరానికి రూ.40 వేలు ఖర్చు చేసిన. చివరకి ఎకరమన్న కాపాడుకోలేకపోతున్న.
-పొలగాని సంపత్, రైతు, మొగ్దుంపూర్, కరీంనగర్ రూరల్ మండలం
చేన్లన్నీ నిండు పొట్టకచ్చినయి. ఆఖరికి నీళ్లు లేక ఎండిపోతున్నయి. రెండు తడులిస్తే అందరం బైటవడ్తుం. నేను తొమ్మిదెకరాలు నాటేసిన. కాలువల నీళ్లచ్చుడు లేదు. బాయిలు ఎండిపోతున్నయి. వాగుల కిలోమీటరు దూరంల ఉన్న ఒక బాయి నీళ్లు 20వేల రూపాయలు పెట్టి కొనుక్కున్న. అక్కడికెళ్లి 40వేలు పెట్టి పైప్ లైన్ ఏసుకున్న. అయినా రెండెకరాలు ఎండిపోయింది. నీళ్లు అందితే ఈ పరిస్థితి రాకపోయేది.
– మంద అశోక్, మొగ్దుంపూర్
నిరుడు, మోయేడు వాగులవడి నీళ్లు పోతుండె. మేం వాడుకోంగ మెదులు తెంపితే నీళ్లు వాగుల వడుతుండె. ఈ యేడు ఎసొంటి పరిస్థితి వచ్చింది. బాయిల్ల నీళ్లు సుతం వట్టిగనే ఒడిసిపోతన్నయి. మొన్నటిదాకా ఎండకాలం సుతం బాయి లు నిండుకుండల్లెక్క ఉండేటిది. ఒకటేసారి ఇట్లయిపోయిం ది. కేసీఆర్ వస్తే మాకు ఇన్ని బాధలు ఉండకపోవు. అప్పుడు నీళ్లుబాగనే వచ్చినయి. వాడుకోంగ వదిలేస్తుంటిమి.
– బండి సంపత్, మొగ్దుంపూర్
నేను నాలుగు ఎకురాలల్ల వరి ఏసిన. నిండు పొట్టకచ్చింది. ఇంకో రొండు తడులైతే పంట చేతికచ్చేది. నీళ్లు రాక మొత్తం ఎండిపోయింది. మా కట్టం ఎవలకు చెప్పుకోవన్నో అర్థమైత లేదు. మా ఊళ్ల నూటికి 60 శాతం పంటలు ఖతమైనయి. నీళ్లు ఇస్తరనే నమ్మకంతోనే పంటలు సాగు చేసినం. ఏడెమిది సార్లు నీళ్లిచ్చిన్రట. ఒక్కసారన్నా మాకు నీళ్లు రాలే. మొదట్ల రెండు మూడు రోజులు ఇచ్చినమా అంటే ఇచ్చినమన్నట్టు ఇచ్చిన్రు. అటెన్క ఒక్క సారన్న నీళ్లు రాలే. ఇక ఎట్ల బైటవడ్తం? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు గిట్ల లేకుండె. నీళ్లు వాగుల ఇడిస్తే పారుకుంట పోయినయి. బాయిల్ల నీళ్లు ఉబ్బుతుండే. అప్పుడు కరువన్న ముచ్చటే లేకుండె.
– దాడి లచ్చయ్య, మొగ్దుంపూర్