కోనరావుపేట, మార్చి 15 : కోనరావుపేట మండలం తల్లడిల్లుతున్నది. తలాపునే జల బాంఢాగారం మల్కపేట రిజర్వాయర్ ఉన్నా చుక్కనీరు వాడుకోలేని దుస్థితిలో మగ్గుతున్నది. సాగును బంగారం చేయడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కారు జలాశయాన్ని నిర్మించింది. ఎడమ కాలువను పూర్తి చేసింది. కుడి కాలువ పనులు చివరి దశకు తీసుకురావడం, అంతలోనే ప్రభుత్వం మారింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడం, తట్డెడు మట్టికూడా తీయకపోవడంతో అసంపూర్తిగానే మిగిలిపోవడంతో పల్లెల్లో సాగునీటి కటకట తీవ్రమైంది.
నిజామాబాద్, ధర్మారం, సుద్దాల, పల్లిమక్త, నాగారం, మామిడిపల్లి గ్రామాల్లో పంట ఎండుతున్నది. భూగర్భజలాలు పడిపోయి బోర్లు, బావులు ఇంకిపోగా, రైతులు ఆగమవుతున్నారు. పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు రైతులు లక్షలకు లక్షలు అప్పులు చేసి బోర్లు వేయిస్తున్నా చుక్క నీరు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. పలువురు డబ్బులు చెల్లిస్తూ ట్యాంకర్ల ద్వారా నీరందించుకుంటున్నారు. కొన్ని చోట్ల పంటపై ఆశలు వదిలేశారు. చేసేదేం లేక పశువులకు మేతగా వదిలేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు రైతులు కోరుతున్నారు.
కేసీఆర్ చేసిన పనులే.. కొత్తవి చేయలే..
మాది నిజామాబాద్ ఊరు. తలెత్తి చూస్తే కేసీఆర్ నిర్మించిన మల్కపేట రిజర్వాయర్ కనవడుతది. ఇక నా పంట పక్క నుంచే నీరు పోయేందుకు ప్రధాన కాలువ తీసిండ్రు. కేసీఆర్ చేసిన పనులు తప్ప ఇప్పటివరకు మల్లా కొత్త పనులు చేయలే. కాలువ పాడువడి పోయింది. తుమ్మలు మొలిచినయి. కాలువ పూర్తయితే మాకు మస్తు నీళ్లస్తుండే. ఈ బాధ ఉండకపోవు. నాకు ఊళ్లే ఐదెకరాల భూమి ఉంది. సాగు నీటి మీద ఆశ లేక రెండెకరాలే సాగు చేసిన. నాలుగు బోర్లు వేసినా లాభం లేదు. కొన్నే నీళ్లు వస్తున్నయి. ఎకరం కూడా పారుతలేదు. పెట్టుబడి రూ.50వేలైంది. పంట పండుతదో లేదో.. తెలువది గానీ ఎండిపోవద్దని రోజుకు రూ.4వేలు పెట్టి నాలుగు వాటర్ ట్యాంకర్లతో పారిస్తున్నా. మాలాంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలె. కెనాల్‌ను పూర్తి చేయాలి.
– కొండం మోహిన్రెడ్డి, రైతు, నిజామాబాద్(కోనరావుపేట)
నీళ్లు పారక పశువులను మేపుతున్న..
నాకు నిజామాబాద్‌లో రెండున్నరెకరాల భూమి ఉన్నది. మరో ఎకరంనర కౌలుకు తీసుకుని వరి వేసిన. మల్కపేట రిజర్వాయర్‌తో మా ఊళ్లే బోర్లు, బావుల్ల నీళ్లుంటయని అనుకున్న. కానీ కాంగ్రెస్ సర్కారు రిజర్వాయర్ల నీళ్లు పూర్తిగా నింపలే. కుడి కాలువను పూర్తిచేయలే. భూ గర్భ జలాలు పడిపోయినయి. నీరందక చేతికందివచ్చిన పంటలు ఎండిపోతున్నయి. చేసేదేమిలేక పశువులను మేపుతున్నాం. ప్రభుత్వం మాలాంటి చిన్నసన్నకారు రైతులను ఆదుకోవాలి.
-గురుక పరశురాములు, యువరైతు, నిజామాబాద్(కోనరావుపేట)
పొట్టదశలో ఎండిపోతంది..
నాకు ఊళ్లే రెండెకరాల భూమి ఉంది. వరి వేసిన. మొదటగా ఎదుగుదలతో మంచిగానే ఉన్నా, పొట్ట దశకు వచ్చే సరికి నీళ్లు ఎల్లక ఎండిపోతంది. పొలం నెర్రెలు బారుతుంది. కనీసం పెట్టుబడి పైసలు వచ్చుడు కూడా గగనమైంది. పశువులకు మేతకు పెట్టుడు తప్ప మరో దారి లేదు.
– జంగిలి కిషన్, రైతు, నిజామాబాద్(కోనరావుపేట)