సిరిసిల్ల టౌన్, జూలై 19: రాష్ట్రంలో అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పాలన నడుస్తున్నదని నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు ధ్వజమెత్తారు. నిబంధనల పేరిట అసలు రైతులకు మొండి చేయి చూపిందని, రుణమాఫీ చేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీకి ఇవ్వాల్సింది 42వేల కోట్లయితే కేవలం 11.40 లక్షల మంది రైతులకు 6వేల కోట్లు మాఫీ చేసిందన్నారు. కానీ, 31వేల కోట్లు మాఫీ చేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. ఆధార్ కార్డు లింక్ లేద ని, రేషన్ కార్డును ప్రామాణికంగా చూపుతూ 4వేల కోట్లకుపైగా పంట రు ణాలను ఎగ్గొడుతున్నదని వాపోయారు. 7 వేల కోట్ల రైతుభరోసా నిధుల ను దారి మళ్లించి రుణమాఫీ చేసిందని ఆరోపించారు. రైతుల అభ్యున్నతికి కృషి చేస్తే స్వాగతిస్తామని, రాజకీయ రంగు పులిమితే సహించబోమని హెచ్చరించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా, పట్టణాధ్యక్షులు తోట ఆగయ్య, జిం దం చక్రపాణితో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం 2014లో 35లక్షల మంది రైతులకు 16 వేల కోట్లు, 2023లో 38 లక్షల మందికి 19 వేల కోట్లు మాఫీ చేశారని గుర్తుచేశారు.
రుణం తీసుకున్న ప్రతిరైతుకూ రుణమాఫీని వర్తింపజేశారని చెప్పారు. కానీ, రేవంత్ ప్రభుత్వం అడ్డగోలు కొర్రీలు పెడుతున్నదని ఆక్షేపించారు. ఒకే విడుతలో చేస్తామని ఎన్నికల్లో హా మీ ఇచ్చి, ఇప్పుడు మూడు సార్లు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రూ.లక్షలోపు రుణం ఉన్నవారు మాత్రమే అర్హులు అని చెప్పిన ప్రభుత్వం కేవలం యాభైశాతం మందికి మాత్రమే మాఫీ చేసిందనన్నారు. రుణమాఫీ కి అర్హుల జాబితాను విడుదల చేయకుండా ఎందుకు గోప్యం పాటిస్తున్నద ని ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యులు నిలదీస్తారనే భయంతోనే ఆదరాబాదరగా రుణాలను మాఫీ చేసిందన్నారు. ఇప్పటికైనా నిబంధనల వర్తింపు విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, గడువులోగా పంట రుణాలన్నీ ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 60శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని,రైతుబంధును ఎందుకు నిలిపివేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య మాట్లాడుతూ, రుణమాఫీ ప్రక్రియలో గందరగోళం నెలకొందన్నారు. రైతులకు 2లక్షల రుణం మాఫీ చేసే వరకు బీఆర్ఎస్ పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ సత్యనారాయణ, నాయకులు మల్లారెడ్డి, మాట్ల మధు, కంచర్ల రవిగౌడ్, వెంకటరమణరావు, గజభీంకార్ రాజన్న ఉన్నారు.