Godavarikhani | కోల్ సిటీ, మే 11 : రామగుండం నగర పాలక సంస్థ అధికారులకు దుకాణాల కూల్చివేత విషయంలో చూపించిన ఉత్సాహం తిరిగి రోడ్డు వెడల్పు పనులపై చూపించడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగర పాలక 31వ డివిజన్ పరిధిలోని ప్రధాన కూరగాయల మార్కెట్ రోడ్డును వెడల్పు, అభివృద్ధి పేరుతో కొద్ది రోజుల క్రితం హడావిడిగా నగర పాలక ఇంజనీరింగ్ విభాగం అధికారులు జేసీబీతో దుకాణాలను తొలగించారు. రోడ్డు వెడల్పు జరిగితే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని ఆశ చూపించారు.
అందుకు వ్యాపారులు కూల్చివేతలకు సహకరించారు. తీరా చూస్తే రోడ్డు వెడల్పు పనుల విషయంలో రోజులు లెక్కబెడుతూ తాము జీవనోపాధి కోల్పోయామని వాపోతున్నారు. మరోప్రక్క మళ్లీ రోడ్డు ప్రక్కన ఆక్రమణలు జరుగుతున్నాయి. అప్పటికి విశాలంగా ఉన్న రోడ్డును కావాలనే వెడల్పు పేరుతో ఎవరి స్వార్థం కోసమోనని నిర్ధాక్షిణ్యంగా దుకాణాలు తొలగించారని ఆరోపిస్తున్నారు. రోడ్డు పక్కన అక్రమణల వల్ల తమ వ్యాపారాలు నడవడలేని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికైనా నగర పాలక సంస్థ కమిషనర్ జోక్యం చేసుకొని రోడ్డు నిర్మాణం పనులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఈ విషయమై నగర పాలక ఎస్ఈ శివానందంను వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు.