జగిత్యాల, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పాలనలో రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పగబట్టిందని, తెలంగాణను ఎండబెడతూ రైతులను నిలువునా ముంచివేస్తున్నదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరంపై విషప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ చిల్లర వేషాలు మానుకోవాలని, మోటర్లు నడిపి నీళ్లివ్వాలని హితవుపలికారు. కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ వీక్షిస్తున్న సమయంలో కావాలనే కరెంట్ నిలిపివేశారని మండిపడ్డారు. ఇలా కరెంట్ బంద్ చేస్తే వాస్తవాలు దాగుతాయా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను జగిత్యాల బీఆర్ఎస్ భవన్లో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు, రైతులతో కలిసి ఆయన వీక్షించారు. ఈ సమయంలో కరెంట్ పోవడంతో ఆగ్రహించారు. బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి జిల్లాకేంద్రంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. స్వరాష్ట్రంలో తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా నీళ్ల సాధనపైనే దృష్టి సారించారని, మిషన్ కాకతీయతో చెరువులకు పునర్జీవం పోశారని గుర్తు చేశారు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, గోదావరి జలాలను రాష్ట్రంలోని బీడు భూములకు మళ్లించారని చెప్పారు. కాళేశ్వరం అంటే కేసీఆర్ అని, కేసీఆర్ అంటే కాళేశ్వరం అని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలనే కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. మేడిగడ్డ బరాజ్‌లోని ఒక పిల్లర్ కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కూలిపోయినట్టు ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నదన్నారు.
ఎన్డీఎస్ఏ ప్రాజెక్టును సందర్శించిన ఏడాది తర్వాత నివేదిక ఇచ్చిందని, ఈ నివేదికలో పిల్లర్లకు మరమ్మతు చేసి నీళ్లను నిలుపుకోవచ్చని చెప్పిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని చెప్పలేదన్నారు. అయినా చిన్న సమస్యను బూతద్దంలో పెట్టి చూపించే కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బ్యారేజీలు కూలిపోవాలన్నదే రేవంత్‌రెడ్డి ఆశయమని, మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంపై ఎవరికి అనుమానాలు లేకున్నా తనకు మాత్రం అనుమానం ఉందని, అధికారం కోసం ఏదైనా చేసే నైజం రేవంత్‌ది అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలంగాణ సీఎం ఏజెంట్ అనే విషయం అందరికి తెలిసిందేనని, ఈ ఇద్దరి సీఎంల సమష్టి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టు పెట్టేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అనంతరం జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, ప్రభుత్వం అబద్ధపు పునాదుల మీద నడుస్తున్నదని విమర్శించారు. ప్రజలకు నిజాలు తెలుస్తాయనే భయంతోనే కాంగ్రెస్ కరెంట్ కట్ చేసిందని, అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా పని పనిచేస్తున్నారని మండిపడ్డారు. అసాధ్యం అనే పనులను సుసాధ్యం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి నాయకుడిపై ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉంటారని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కేసీఆర్‌ను తిట్టడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అలాల దామోదర్‌రావు, శివకేసరి బాబు, వొల్లెం మల్లేశం, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.