ధర్మపురి, ఫిబ్రవరి 2 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు పేరు వినిపించినా.. కనిపించినా కాంగ్రెస్ ప్రభుత్వానికి కలవరం మొదలైందని, ఆయన గుర్తుగా ఉన్న పథకాలను ఒక్కొక్కటి పక్కకు పెట్టేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ధర్మపురి పట్టణంలోని మైనార్టీ బాలికల గురుకుల కళాశాలలో రెండు రోజుల క్రితం ఆహారం వికటించి ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. వారిని పరామర్శించేందుకు ఆయన ఆదివారం గురుకులానికి చేరుకున్నారు.
అయితే, గురుకులంలోకి కొప్పుల ఈశ్వర్‌ను అనుమతించలేదు. దీంతో ఆయన ప్రిన్సిపాల్‌కు లక్ష్మికి ఫోన్ చేయగా.. గురుకుల గేటుదాటి లోనికి ఎవరినీ అనుమతించకూడదని కలెక్టర్ నుంచి ఆదేశాలున్నాయని తెలపడంతో, ఆయన కళాశాల గేటు బయటే విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇటీవలి కాలంలో గురుకులాలు, పాఠశాలల్లో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ కావడం, విషపురుగులు కుట్టడం, ఆహారంలో బల్లులు పడడం వంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 57 మంది విద్యార్థులు గురుకులాల్లో చనిపోవడం బాధాకరమన్నారు.
కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేయాలని కుట్ర
“తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా.. కేసీఆర్ ఆనే మొక్కను ఇకపై మొలవనీయను”.. అంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్ని సభల్లో శపథాలు చేస్తున్నారని, అందుకు అనుగుణంగానే కుట్రలు పన్నుతున్నారని తేటతెల్లమైందని కొప్పుల మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ చరిత్ర లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మైనారిటీల ప్రగతి ప్రధాత కేసీఆర్ అని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, గురుకుల పాఠశాలలు, కేసీఆర్కిట్లు, కల్యాణలక్ష్మి, గొర్రెల పంపిణీ, చేపపిల్లల పంపిణీ ఇలా ఎన్నో చేశామని.. ఇవ్వన్నీ కేసీఆర్ ఆనవాళ్లు అని, వీటన్నింటినీ లేకుండా చేయడానికి కుట్ర జరుగుతున్నదని దుయ్యబట్టారు.
ఒకప్పుడు తెలంగాణకు విదేశాల్లో సైతం గౌరవం ఉండేదని.. ఇప్పుడు అసహ్యించుకునేలా చేశారని మండిపడ్డారు. తాము మైనార్టీ గురుకులానికి వచ్చింది ఆందోళనలు చేయడానికి కాదని, విద్యార్థులను పరామర్శించి వారిలో మనోధైర్యాన్ని నింపి, ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మాత్రమేనని చెప్పారు. కలెక్టర్ అనుమతి లేకుండా ఎవరూ రావద్దని ఆంక్షలు పెట్టడం ఎంతమాత్రం సరికాదన్నారు. ఇక్కడ డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు యూనుస్, ఆసిఫ్, నాయకులు చిలవేరి శ్యాంసుందర్, తిర్మందాస్ అశోక్, అనంతుల లక్ష్మణ్, తరాల కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.