జగిత్యాల, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. బీసీల సంక్షేమానికి బీఆర్ఎస్ మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఈ నెల 14న కరీంనగర్లో సభ నిర్వహిస్తున్నామని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని చెప్పారు. ఈ సభకు జగిత్యాల జిల్లా నుంచి వేలాదిగా తరలి వెళ్దామని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లు దండుకునేందుకే రేవంత్‌రెడ్డి రిజర్వేషన్ల పేరిట కొత్త ఎత్తుగడలు వేశారని విమర్శించారు. క్యాబినెట్ ఆమోదం, ఆర్డినెన్స్ తయారీ, గవర్నర్ ఆమోదం కోసం పంపడం అంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. 42 శాతం రిజర్వేషన్ చట్టం అంశం కేంద్ర పరిధిలోని ఉంటుందని, చట్టం చేసిన తర్వాత సైతం దానికి రక్షణ కల్పించాలంటే 9వ షెడ్యూల్ లో చేర్చాల్సిన అవసరమని తెలిసే మోసం చేసేందుకు యత్నించాడని విమర్శించారు. సీఎం, మంత్రులు అందరూ ఢిల్లీలో ధర్నా చేసి తమ ప్రయత్నం చేశామని, బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని, రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత బీసీ రిజర్వేషన్ సాధిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీల కోసం బీఆర్ఎస్ మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచి అమలు చేయలేని పరిస్థితుల్లో పార్టీ తరఫున స్థానిక సంస్థల టికెట్లలో 42 శాతం ఇచ్చామని గుర్తు చేశారు.
బీసీల కోసం కేసీఆర్ సర్కార్ అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. బీసీల్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టులను గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా రూ. వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. బీసీ కులాల వారి కోసం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశామన్నారు. రాష్ట్రంలో రైతులతో పాటు ఇతర అన్ని వర్గాలను ఆదుకునే విషయంలో రేవంత్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు. రాష్ట్రంలో వర్షాలు లేక రిజర్వాయర్లలో నీళ్లు అడగంటిన పరిస్థితి ఉందని, శ్రీరామ్‌సాగర్, మిడ్ మానేరు, ఎల్ఎండీ, మల్లన్నసాగర్, రిజర్వాయర్లలో నీళ్లు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీలో 43 టీఎంసీలే ఉన్నాయని, ప్రాజెక్టు పరిధిలో 9,65,000 ఎకరాల ఆయకట్టు ఉన్నదని, ఈ సారి కేవలం 6లక్షల ఎకరాలకే నీళ్లిచ్చే పరిస్థితి ఉందన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ 1 కింద లక్షలాది ఎకరాల్లో నార్లు పోసుకొని నీళ్లు అందిస్తారని రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. రైతులను ఆదుకునేందుకు కాళేశ్వరం పంపులను ఆన్ చేసి నడిపించాలని డిమాండ్ చేశారు. రైతులు యూరియా కోసం గతంలో ఎన్నడూ లేనవిధంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించామని, రైతుబంధు, రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక 600 మంది రైతులు ఆత్మహత్య చేసున్నారంటే పాలన ఎలా ఉందో అర్థం అవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితుడు ఓరుగంటి రమణారావు, నాయకులు జవ్వాజి ఆది రెడ్డి, హరీశ్ కల్లూరి, అల్లాల రాజేశ్వర్ రావు, చందా సాయి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పందొమ్మిది నెలలవుతున్నా ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదు. రేవంత్‌రెడ్డి అబద్ధపు హామీలతో గద్దెనెకి, ఇప్పుడు ప్రజలను గోసపెడుతున్నారు. బీసీ రిజర్వేషన్ 42 శాతం సాధిస్తామని మభ్య పెడుతున్నారు. ఏదో ఒక వ్యవహారంతో రాజకీయ పబ్బం గడపడం రేవంత్‌కు అలవాటుగా మారింది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో లబ్ధి పొందేందుకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ మరో కొత్త డ్రామా ఆడుతున్నారు. బీసీలకు బీఆర్ఎస్ వల్లే న్యాయం జరుగుతుంది. ఈ నెల 14న జరిగే బీసీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో బీసీలు హాజరుకావాలి.
సీట్ల కోసం, ఓట్ల కోసం దేవుళ్ల మీద ఒట్టు పెడుతూ అమలు కానీ హామీలను ఇచ్చింది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని సాగునీరు లేదు. రైతులు పోసుకున్న నార్లు ముదిరిపోతున్నాయి. రైతులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి, ఇప్పుడు కొలతలు, నిబంధనల ప్రకారం అంటూ లబ్ధిదారులను ఇబ్బందులు పెడుతున్నారు. రాజీవ్ యువ వికాసం పేరిట ఆర్బాటం చేసిన ప్రభుత్వం లక్షలాది ధరఖాస్తులను స్వీకరించి ఇంత వరకు ఒక్కరికీ లబ్ధి చేకూర్చలేదు. రేవంత్‌కు బీసీలంటే చిన్నచూపు ఉన్నది. ఆయనకు బీసీలపై ఉన్నది కపటప్రేమే. రాబోయే స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే బీసీ రిజర్వేషన్లు, ఇతర పథకాలంటూ ఆ పార్టీ డ్రామాలు ఆడుతున్నది. కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందో చెప్పాలి.