సీతారాంనాయక్ తండాలో మత్తు పదార్థాలపై అవగాహన
Sircilla SP Mahesh B. Gite | వీర్నపల్లి , అక్టోబర్ 18 : గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. మండలంలోని సీతారాం నాయక్ తండాలో దూమ నాయక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘యువత మార్పు- సత్ కార్యాచరణ’ అవగాహన కార్యక్రమానికి హజరై డాక్టర్ మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. డ్రగ్స్, గంజాయిని నిర్మూలించడంలో ప్రతి పౌరుడూ బాధ్యత తీసుకోవాలన్నారు.
విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ ను వినియోగించడం వల్ల సమాజానికి ఇబ్బంది కలిగించే పౌరులుగా మారవద్దని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు, ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు. అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు.
విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెంచుకోవలన్నారు. గర్జనపల్లి గ్రామానికి చెందిన సీఐడీ ఎస్పీ భూక్యా రాంరెడ్డి సమాజ సేవ చేయడానికి శ్రీధూమ నాయక్ సేవ ట్రస్ట్ స్థాపించడం అభినందనియమని తెలిపారు. ఇక్కడ ట్రస్ట్ చైర్ పర్సన్ భూక్యా విజయ, ఐపీఎస్ అధికారి భూక్య రాంరెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మణ్, విద్యార్థులు పాల్గొన్నారు.