ఏటా విస్తరిస్తున్న నగరంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు వ్యయం పెరుగుతున్నది. బల్దియాకు ఆస్తి, తదితర పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయ వృద్ధిలో మాత్రం ప్రగతి లోపించింది. అధికారుల నిర్లక్ష్యం, అవకతవకల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నదనే విమర్శలు వ్యక్తమవుతున్న క్రమంలో కమిషనర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం లోపాలను గుర్తించడంలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా నూతన నిర్మాణాల మదింపునకు క్షేత్రస్థాయి బాట పట్టింది.
-కార్పొరేషన్, ఏప్రిల్ 22
నగరపాలక సంస్థకు ఆస్తి, నల్లా పన్నులు, అడ్వర్టైజింగ్, ట్రెడ్ లైసెన్స్, వాణిజ్య సముదాయాల అద్దె రూపంలో, పారిశుధ్య విభాగం యూజర్ చార్జీల ద్వారా ఆదాయం వస్తుంది. వీటిల్లో ముఖ్యంగా ఆస్తి పన్నుల ద్వారానే భారీగా ఆదాయం సమకూరుతుంది. అలాగే నగరపాలక సంస్థ పారిశుధ్య పనులు, నీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ తదితర పనుల కోసం భారీగానే వెచ్చిస్తున్నది. వీటిల్లో ముఖ్యంగా పారిశుధ్యంపై భారీగా వ్యయం అవుతుండగా.. నీటి సరఫరా, వీధి దీపాలకు సంబంధించి విద్యుత్ బిల్లులు కూడా ఇటీవల కాలంలో భారీగానే పెరిగాయి. అయితే ఈ మేరకు బల్దియా ఆదాయం పెరుగడం లేదన్న వాదనలు వస్తున్నాయి. నగరంలో పెద్ద సంఖ్యలో నూతన కాలనీల ఏర్పాటవుతున్నాయి. అయితే వాటికి పూర్తిస్థాయిలో ఆస్తి పన్ను మదింపు విషయంలో రెవెన్యూ విభాగం అధికారులు నిర్లక్ష్యం, చేతివాటంతో ఆదాయం తక్కువగా వస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో నగరంలో ఆస్తి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
నగరపాలక సంస్థ పరిధిలో ఏటా పెద్ద సంఖ్యలోనే నూతన భవన నిర్మాణాలు సాగుతున్నాయి. అయితే వీటన్నింటినీ పూర్తిస్థాయిలో కొలతలు వేసి ఆస్తి పన్ను నిర్ధారణ చేసే విషయంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. వీటితో పాటు గతంలో నిర్మాణం చేసిన భవనాల్లో కూడా అదనపు నిర్మాణాలు సాగిస్తున్నాయి. అయితే ఇలాంటి నిర్మాణాల వైపు అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అలాగే నగరపాలక సంస్థలోని రెవెన్యూ అధికారులు ఎక్కువగా నూతన ఇంటి నంబర్లు కేటాయింపు, పన్నుల విధింపునకే పరిమితమవుతున్నారు. గతంలో ఇంటి నంబర్ తీసుకొని నూతనంగా అదనపు నిర్మాణాలు చేపడుతున్నా, గతంలో గృహావసరాలకు అనుమతి పొందిన భవనాలను ప్రస్తుతం కమర్షియల్‌గా వినియోగిస్తున్నా వాటి ఆస్తి పన్నుల మదింపు మాత్రం పట్టించుకోవడం లేదు. వీటిపై ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
నూతన నిర్మాణాలతో పాటు, పాత భవనాల్లో అదనపు నిర్మాణాలపై కూడా దృష్టి పెట్టి ఆస్తి పన్నులను మదింపు చేయాలని ఇటీవల నగర కమిషనర్ శ్రీనివాస్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ చర్యలు చేపట్టారు. ఇప్పటికే రాంనగర్, మంకమ్మతోట, సంతోష్‌నగర్ ప్రాంతాల్లో నిర్మాణాల కొలతలు తీయడం ప్రారంభించారు. అయితే ముఖ్యంగా ఇటీవల నగరంలో విలీనమైన ప్రాంతాలు, శివారుల్లో నూతనంగా వెలుస్తున్న కాలనీల్లో భవన నిర్మాణాలకు ఇంటి నంబర్ కేటాయించే విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నగరంలో ప్రధాన ప్రాంతాల్లో గృహావసరాల కోసం అనుమతి పొందిన అనేక భవనాలను ప్రస్తుతం పూర్తిగా కమర్షియల్‌గానే వినియోగిస్తున్నారు. వీటిపై కూడా అధికారులు దృష్టి సారిస్తే బల్దియా ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.