RS Praveen Kumar | పెద్దపల్లి, జూలై 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి పంపే మూటల్లో నుంచి ఒక శాతం తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తే వారి భవిష్యత్ మారుతుందని రిటైర్డు ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఆజీం ప్రేమ్‌జీ స్కాలర్ షిప్‌లకు ఎంపికైన విద్యార్థినీలకు సోమవారం స్కాలర్ షిప్ పత్రాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు ఫీజు రియాంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు.
ఈ పథకాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత కూడా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అద్భుతంగా కొనసాగించి ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించారన్నారు. తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్ భారాన్ని తమ ప్రభుత్వం మోయలేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేశారన్నారు. ఫీజు రియాంబర్స్మెంట్పై కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించి రూ. 12వేల కోట్ల బకాయిలను చెల్లించలేదన్నారు. కళాశాల యాజమాన్యాలను విద్యార్థుల ద్వారా నేరుగా ఫీజులు వసూల్ చేయాలని చెప్తుండటంతో పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతున్నదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియాంబర్స్మెంట్పై చేతులెత్తేయడం వల్ల చిన్న, సన్నకారు కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు.
ఢిల్లీకి మూటలు పంపించడం, తన మంత్రులు, ఎమ్మెల్యేలకు కాంట్రాక్టులు ఇస్తూ డబ్బులు సంపాదించుకునేలా చేయడంపై ఉన్న శ్రద్ధ పేద విద్యార్థులకు ఉన్నత చదువును అందించడంపై సీఎం రేవంత్‌రెడ్డికి లేదన్నారు. తెలంగాణలోని విద్యార్థులకు ఫీజు రియాంబర్స్మెంట్ పథకం మళ్లీ వర్థించేలా బీఆర్ఎస్ పార్టీ తరుపున పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష, బీసీ జేఏసీ నాయకులు నల్లవెల్లి శంకర్, సిరవేని స్వప్న, స్వేరోస్ నాయకుడు కన్నూరి శ్రీశైలం, అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.