UPSC : యువతను కేవలం ఉద్యోగం కోసం కాకుండా ప్రజాసేవ స్ఫూర్తితో పబ్లిక్ సర్వీసెస్ (Public Services) లోకి తీసుకురావాలని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పిలుపునిచ్చారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వందేళ్ల ప్రస్థానం లక్షల మంది యువత ఆకాంక్షలకు, దేశ ప్రజల నమ్మకానికి ప్రతీక అని కొనియాడారు. లక్షల మంది యువత ఆశయాల వేడుక యూపీఎస్సీ అని కీర్తించారు. గురువారం ఢిల్లీ (Delhi) లోని భారత్ మండపంలో జరిగిన యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌తోపాటు ‘100 ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్స్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బుధవారం జరిగిన ఒక విమాన ప్రమాద ఘటనలో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. భారత పైలట్ కెప్టెన్ స్మిత్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, నిబద్ధత ప్రశంసనీయం అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని చెప్పినట్లుగా 9/11 తరహా ఘోర విషాదాన్ని ఒక భారతీయుడు అడ్డుకున్నాడని మోదీ అన్నారు.
స్మిత్ ఘనత మనందరికీ గర్వకారణమని, తాను ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడానని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న స్మిత్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని దేశ ప్రజలందరూ ప్రార్థించాలని పిలుపునిచ్చారు. యూపీఎస్సీ వందేళ్ల ప్రస్థానంపై మోదీ మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక సంస్థ వందేళ్లు పూర్తి చేసుకోవడం కాదని, ప్రతి భారతీయుడు ఈ సంస్థపై ఉంచిన అచంచల విశ్వాసానికి ఇది నిలువుటద్దమని అన్నారు. ఈ సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చిన ప్రతి ఒక్కరికీ ప్రధాని అభినందనలు తెలిపారు.
అనంతరం సివిల్ సర్వీసుల చరిత్రను, మహనీయుల సేవలను మోదీ గుర్తుచేసుకున్నారు. 1920లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని అన్నారు. నాడు బ్రిటిష్ పాలన ఉన్నప్పటికీ బోస్ సంస్కృతంలో పేపర్ రాశారని ఇక్కడి గ్యాలరీలో చూసినట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ యూపీఎస్సీని దేశానికి ఒక ప్రధాన స్తంభంగా తీర్చిదిద్దారని చెప్పారు. 1926 అక్టోబర్ 1న పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా ప్రారంభమైన ఈ సంస్థ.. శతాబ్దకాలంలో ఎన్నో మార్పులకు లోనై స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థగా రూపుదిద్దుకుందని ప్రధాని గుర్తుచేశారు.
కాగా గత ఏడాది అక్టోబర్ 1న ప్రారంభమైన శతాబ్ది ఉత్సవాలు ఇవాళ్టి కార్యక్రమంతో ముగిశాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో రెండు రోజులపాటు జరిగిన ఈ వేడుకలకు వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, విద్యావేత్తలు, యూపీఎస్సీ అధికారులు హాజరయ్యారు.