కారేపల్లి, అక్టోబర్ 01 : కారేపల్లిలోని శ్రీ కవిత ఇంజినీరింగ్ కళాశాల భవన్ లో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలను భద్రాద్రి జోన్ జోనల్ అధికారి పి.అపర్ణ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడిన ఆమె విద్య బోధన, వసతి, భోజనం, ఆరోగ్యం, మౌలిక సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతున్నట్లు విద్యార్థినులు తెలిపారు. అనంతరం SA-1 పరీక్షల నిర్వహణను పరిశీలించిన జోనల్ ఆఫీసర్ పరీక్షలు సక్రమంగా జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. డైనింగ్ హాల్, కిచెన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత, పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. క్యాంపస్ పరిసరాల్లో పెరిగిన గడ్డిని తొలగించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థినులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని నిరంతరం కల్పించాలని పేర్కొన్నారు.

గురుకుల పాఠశాలలో జోనల్ ఆఫీసర్ అపర్ణ ఆకస్మిక తనిఖీ