Collector Koya Sriharsha | పెద్దపల్లి, సెప్టెంబర్ 12 : పెద్దపల్లి జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఉపాధి అవకాశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీజీ ఐపాస్ కింద నూతన పరిశ్రమల ఏర్పాటుకు చేసుకున్న ప్రతీ దరఖాస్తును పరిశీలించి నిర్దిష్ట గడువులోగా అనుమతులు జారీ చేయాలన్నారు.
లీడ్ బ్యాంక్ మేనేజర్, పరిశ్రమ శాఖ అధికారులు, టాస్క్ అధికారులు సమన్వయంతో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందేలా శిక్షణ ఇప్పించాలని సూచించారు. టామ్ కామ్ ద్వారా విదేశాలలోని ఉద్యోగ అవకాశాలను జిల్లా యువత వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి కీర్తి కాంత్, లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేష్, ఆర్టీవో రంగా రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.