Korutla | కోరుట్ల, ఏప్రిల్ 17 : అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుట్ల పట్టణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం వివిధ శాఖల ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్ల సాధన కోసం నల్ల బ్యాడ్జీలు ధరించిన ఉద్యోగులు భోజన విరామ సమయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రెండో పీఆర్సీని 51 శాతం ఫిట్మెంట్తో తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం హెల్త్ స్కీమ్‌ను వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. 13వేల పైచిలుకు ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బిల్లులను ఒకేసారి విడుదల చేయాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందుంచిన 63 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు.
ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు కుమారస్వామి, సంపత్, నునావత్ రాజు, రాకేష్, రుద్రమాణిక్యం, లావణ్య, షిరాజ్, ప్రభు, అబ్దుల్ వాజిద్, నవీన్, మోహన్ ప్రసాద్, సైపోద్దిన్, పూర్ణచందర్, సర్తాజ్, దామోదర్, రాజేష్, వినోద్, నారాయణ, రత్నాకర్, సృజన్, నగేష్, శ్యామ్, గోపి, వైశాలి, అనూష, గంగాధర్, మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.