Pending Bills | కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 16 : దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా మారింది. డీఆర్డీఏలోని అద్దెవాహన యజమానుల పరిస్థితి. నెలల తరబడి పెండింగ్లో ఉన్న అద్దె బిల్లులు విడుదలై నెల గడుస్తున్నా చెల్లించకుండా ఓ అధికారి రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేమిటంటే కుంటి సాకులు చెబుతూ రోజులు గడుపుతున్నాడని. పండగపూట కూడా తమ కుటుంబాలను పస్తులుంచాడని వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బిల్లుల విడుదలకు అవసరమైన డాక్యుమెంట్లు సక్రమంగా లేవంటూ ఉన్నతాధికారికి సైతం తమపై తప్పుడు సమాచారం అందించి, ఆయనను కూడా తప్పుదారి పట్టిస్తున్నాడని మండిపడుతున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో ఎల్ 4,, ఎల్ 5 కేటగిరీల్లో విధులు నిర్వహించే డీపీఎంలు, ఏపీడీలు క్షేత్రస్థాయి పర్యటనలు చేసే నిమిత్తం అద్దె వాహనాల సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఒక్కో వాహనానికి నెలకు రూ.33వేల చొప్పున అద్దె చెల్లింపు ప్రాతిపదికన ఐదుగురు డీపీఎంలు, ఒక ఏపీడీ అద్దె వాహనాలు వినియోగిస్తున్నారు. ఒప్పందం మేరకు వాహనాల యజమానులకు ప్రతీ నెల బిల్లులు చెల్లించాల్సి ఉండగా, ఆరు నెలలు, ఏడాదికోసారి అన్నట్లుగా విడుదలవుతుండగా, వాటితోనే సరిపెట్టుకుంటున్నారు. ఈక్రమంలో ఇటీవల 11 నెలల బిల్లులు ఉమ్మడి జిల్లాలో విడుదలయ్యాయి. ఈ మొత్తాన్ని వాహనాల యజమానుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలి.
అయితే, బిల్లుల క్లెయిమ్ అప్లికేషన్లలో తప్పులు దొర్లాయంటూ కొంతమందికి, సరైన డాక్యుమెంట్లు జత చేయలేదని మరికొంతమందికి, పెండింగ్ బిల్స్ హైద్రాబాద్లో అప్రూవల్ అయి రావాలంటూ ఇంకొంత మందికి తప్పుడు సమాధానాలిస్తూ జాప్యం చేస్తున్నట్లు వాహనాల యజమానులు ఆరోపిస్తున్నారు. బిల్లులు చెల్లించిన సందర్భంలోనే వాటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే వాహనాలకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటేనే సంబంధిత వాహన యజమానితో అద్దె ఒప్పందం చేసుకునే అవకాశముంటుంది. వీటికి భిన్నంగా బిల్లుల చెల్లింపు సమయంలో డాక్యుమెంట్లలో లోపాలంటూ తిరకాసు పెట్టడం వెనుక ఆంతర్యమేంతో చెప్పాలని అద్దె వాహనాల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
అసలే నిరుద్యోగులం ఆపై అప్పోసప్పో చేసి వాహనాలు కొనుగోలు చేసి అద్దెకు అప్పగిస్తే, తమను ఇబ్బందుల పాలు చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్కో యజమానికి ఆరు నుంచి ఎనిమిది నెలల బిల్లులు పెండింగ్లో ఉండగా, తామంతా నిత్యం డిఆర్డిఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా. అధికారులు మాత్రం కనికరించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు రాగానే చెల్లిస్తారనే ఆశతో తాము అప్పు తెచ్చి ఈఎంఐలు చెల్లిస్తున్నామని, అప్పులిచ్చిన వారికి తిరిగి ఇవ్వకపోవటంతో తమకు కొత్త అప్పులు పుట్టక ఫైనాన్స్ దారులు తమ వాహనాలు స్వాధీనం చేసుకునే దుస్థితి నెలకొందని వాపోతున్నారు. పెండింగ్ బిల్లులు క్లియరవుతున్నాయి సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకుందామనే ఆశతో ఉంటే, తమ కుటుంబాలు పస్తులుంచారని వాహనాల యజమానులు ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. అధికారుల తీరు భరించలేక కొంతమంది తమ వాహనాల అద్దె ఒప్పందం రద్దు చేసుకోగా, వాటి స్థానంలో తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లపై ఆశాఖలోని అధికారుల వాహనాలే బాడుగకు తిప్పుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటికి మాత్రం ముందుగానే బిల్లులు చెల్లిస్తూ, తమకు కొర్రీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర జిల్లాల్లో చెల్లించినా…ఇక్కడ మాత్రం పెండింగ్లోనే..
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో కొనసాగుతున్న అద్దె వాహనాల బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ఇతర జిల్లాల్లో ఇరవై రోజుల క్రితమే పూర్తి చేశారు. కానీ, కరీంనగర్ జిల్లాలో మాత్రం అధికారులు ఇప్పటి వరకు ఆ ఫైల్ కూడా ముట్టనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు బిల్లులు మంజూరు కాగా, ఆరు వాహనాలకు కలిపి రూ.21.78 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం విడుదలైనా తమను ముప్పుతిప్పలు పెండుతుండటంపై కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వాహనాల యజమానులు స్పష్టం చేస్తున్నారు. అయినా, స్పందించకుంటే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.