Peddapally | పెద్దపల్లి టౌన్, ఫిబ్రవరి 10 : విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగర రజనీకాంత్ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రజినీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగాన్ని ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి మోసం చేసిందని వ్యాఖ్యానించారు.
గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. కొఠారి కమిషన్ ప్రకారం పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు సమరమైన విద్య అందాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే బడ్జెట్లో 30శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్స్, గురుకులాలు అద్దె భవనంలో కొనసాగుతున్నాయని, విద్యార్థులకు పౌష్టికాహారమైన భోజనం అందడం లేదని వాపోయారు.
యూనివర్సిటీలు, జెఎన్టీయూ కళాశాలలో పూర్తిస్థాయిలో లెక్చరర్స్ లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఈ సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర నికి విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ల సందీప్, జిల్లెల ప్రశాంత్, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.