కాంగ్రెస్ సర్కారు పేదలపై చిన్నచూపు చూస్తున్నది. అర్హులందరికీ సొంతింటి కల నెరవేర్చుతున్నామని బీరాలు పలుకుతున్నా.. ఆచరణలో మాత్రం తుస్సుమనిపిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో పెద్దపల్లి పట్టణంలోని రాంపల్లిలో జీ ప్లస్ 2, 3 పద్ధతిలో 288 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించగా, తుది దశ టైంలో ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, మిగిలిపోయిన పనులు పూర్తి చేయకుండానే ఇటీవల ప్రారంభించి అందజేయగా, లబ్ధిదారులు అందులో ఉండలేని పరిస్థితి నెలకొన్నది. ఎటుచూసినా కుంగిన ఫ్లోరింగ్లు, దెబ్బతిన్న పైప్లైన్లు, నాణ్యత లేని ధర్వాజలు, కిటికీలు, తలుపులు, గోడలకు పగుళ్లతో అధ్వానంగా మారింది. డ్రైనేజీలకు కనెక్షన్లు సరిగ్గా లేక సెప్టిక్ ట్యాంకుల నుంచి మురుగునీళ్లు లీకవుతూ దుర్వాసన వస్తున్నది. ఇంట్లోకి వెళ్లాలంటే మరమ్మతులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండగా, కొత్తింటి సంబురమే లేకుండా పోతున్నది. ఇండ్లల్లోకి రాకుంటే రద్దు చేస్తామని అధికారులు చెబుతుండగా, అప్పులు తెచ్చుకొని పనులు చేయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది.

పెద్దపల్లి, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కారు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టింది. విడుతలవారీగా నిర్మించి అందజేసింది. అయితే పెద్దపల్లి పట్టణంలోని రాంపల్లిలో ఆర్అండ్బీ శాఖ ద్వారా 160 ఇండ్లు జీప్లస్-2 పద్ధతిలో.. గృహ నిర్మాణ శాఖ ద్వారా 128 ఇండ్లు జీప్లస్-3 పద్ధతిలో నిర్మాణం చేపట్టింది. పనులు తుది దశకు వచ్చిన సమయంలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఆఖరి దశలో పనులను పూర్తి చేయాల్సి ఉండగా, చేతులెత్తేసింది. జూన్ 13న మంత్రుల చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి అందజేయగా, లబ్ధిదారులు సంబురపడ్డారు.
కానీ, తీరా ఇండ్లలోకి వెళ్లి చూసి వసతులు లేకపోవడంతో అవాక్కయ్యారు. అయితే నిర్మాణ సమయంలో ప్రభుత్వం మారడంతో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలిచ్చినట్లు తెలుస్తున్నది. మెజార్టీ ఇండ్లలో గోడలకు పగుళ్లు, కుంగిన ఫ్లోరింగ్లు, పని చేయని పైప్ లైన్లు, విద్యుత్ లైన్లు, నాణ్యత లేని ధర్వాజలు, కిటికీలు, తలుపులు, సరిగ్గా లేని విద్యుత్ లైన్లే కనిపిస్తున్నాయి. కాలనీ మొత్తానికి కేవలం నాలుగు వీధి దీపాలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఇండ్ల పరిసరాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉన్నది.
ఈ మరమ్మతులన్నీ లబ్ధిదారుడే చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఒక్కో ఇంటికి దాదాపుగా 75వేల నుంచి 1.50లక్షల ఖర్చవుతున్నదని వాపోతున్నారు. ఇక్కడ మొత్తం 288 మందికి ఇండ్లను అందజేయగా, కేవలం 50 మంది మాత్రమే తమ కుటుంబాలతో నివసిస్తున్నారు. ఖర్చులు పెట్టుకునే పరిస్థితులు లేక ఇండ్లల్లోకి రావడానికి చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే మున్సిపల్ అధికారులు మాత్రం ఎవరైతే ఇండ్లల్లోకి రారో.. అలాంటి వారి ఇండ్లను రద్దు చేస్తామని చెబుతుండడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపి అరకొరగా మిగిలిపోయిన పనులను పూర్తి చేసి తమకు మేలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

డీఎంఎఫ్టీ నిధులు ఏమైనట్టు..
రాంపల్లిలోని ఇండ్లతోపాటు చందపల్లిలో నిర్మించిన 196 డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 5కోట్ల డీఎంఎఫ్టీ నిధులను వెచ్చించి రోడ్లు, డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంక్లు, నీటి సరఫరా, ఇతర సౌకర్యాలను కల్పించినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కానీ రాంపల్లిలో పనులన్నీ నాణ్యతాలోపంతోనే జరిగినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా బీటీ రోడ్డు అసంపూర్తిగానే వదిలేశారు. డ్రైనేజీలు అంతంత మాత్రంగానే నిర్మించారు.
ఇండ్లకు డ్రైనేజీలకు కనెక్షన్లు సరిగా లేక సెప్టిక్ ట్యాంకుల నుంచి మురుగునీళ్లు లీకవుతున్నాయి. దీనికి తోడు జీప్లస్ 2, జీప్లస్ 3కి సంబంధించి ఇండ్లపై వెయ్యి లీటర్లు, 1500 లీటర్ల సామర్థ్యంతో ట్యాంకులు నిర్మించినా.. అవి కుటుంబాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. దీనికితోడు ట్యాంకుల నుంచి ఇండ్లకు ఇచ్చిన కనెక్షన్లు సైతం సరిగా లేకపోవడంతో పలు చోట్ల నీరు లీకవుతున్నది. డబుల్ బెడ్రూం ఇండ్లల్లోనే కాదు, వరండాల్లో సైతం ఫ్లోరింగ్ దెబ్బతిని పగుళ్లు తేలాయి. ఒక ఇంటికి మరో ఇంటికి మధ్య చెత్తా చెదారం, చిత్తడి తప్ప సరిగ్గా రోడ్లు కూడా వేయలేదు. భారీ మొత్తంలో నిల్వ చేసిన సిమెంటు బస్తాలను నిర్లక్ష్యం చేయడంతో గడ్డకట్టిపోయాయి. ప్రభుత్వ నిధులను పకడ్బందీగా ఖర్చు చేయాల్సి ఉండగా, అడుగడుగునా ప్రజాధనం వృథా జరిగిందనే విమర్శలున్నాయి.
ఏం లాభం లేదు
డబుల్ బెడ్రూం అచ్చినట్టేగానీ ఏం లాభం లేదు. వాటర్ లీకేజీలు, అధ్వానమైన రోడ్లు, అరకొర సౌలతులే ఉన్నయి. ఫ్లోరింగ్ సక్కగా లేదు. పైప్లైన్లు అట్లట్లే ఉన్నయి. 25 వేల రూపాయలు ఖర్చు చేసి బాగు చేసుకున్నం. తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ మరమ్మతలకు మరో 50వేల రూపాయలు అయితయట. మేం ఎక్కన్నుంచి తెచ్చేది?
– ఎండీ గౌస్ పాషా, రాంపల్లి
డ్రైనేజీ పైపులు లీకైతున్నయి
ఇంట్లో వాడిన నీళ్లు బయటికి వెళ్లే డ్రైనేజీ పైపులు సరిగా వేయలేదు. నీళ్లు లీకవుతున్నయి. చెడువాసన వస్తున్నది. ఇండ్లలో ఉండలేకపోతున్నం. కరెంటు కూడా సరిగా లేదు. పైసలు అప్పుతెచ్చి మిగిలిన పనులు చేసుకుంటున్నం. అధికారులు పట్టించుకోవాలె. ఇక్కడ వసతులు కల్పించాలె.
– గోవిందుల నాగలక్ష్మి, రాంపల్లి
ఇండ్లల్లోకి రాకపోతే రద్దు చేస్తాం..
రాంపల్లిలో 288, చందపల్లిలో 196 డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేసి జూన్లో లబ్ధిదారులకు పంపిణీ చేశాం. నిర్మాణాలు అసంపూర్తిగా ఉంటే రూ. 5కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో వసతులు కల్పించాం. ఇంకా మరిన్ని నిధులు అవసరం ఉంది. లబ్ధిదారులు పత్రాలను అందుకున్నప్పటికీ చాలా మంది ఇండ్లల్లోకి రావడం లేదు. లబ్ధిదారులు ఇండ్లల్లోకి రాకపోతే ఉన్నతాధికారుల అనుమతితో రద్దు చేసి కొత్తవారికి కేటాయిస్తాం
