కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 14 : నగరంలోని గోదాంగడ్డలో అధునాతన హంగులతో దోభీఘాట్ రూపుదిద్దుకున్నది. కులవృత్తులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ పట్టణాల్లో మోడ్రన్ దోభీఘాట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కరీంనగర్‌లోని గోదాంగడ్డలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 2కోట్ల వ్యయంతో అత్యాధునిక దోభీఘాట్ నిర్మాణపనులను ప్రారంభించారు. అయితే, పనులన్నీ పూర్తయినా విద్యుత్ సరఫరా విషయంలో వచ్చిన ఇబ్బందులతో గతంలో అందుబాటులోకి రాలేదు. కాగా, ఇటీవల మేయర్ యాదగిరి సునీల్‌రావు దీనిపై ప్రత్యేక దృష్టి సారించడంతో విద్యుత్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ నెల 13 నుంచి రజకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ దోభీఘాట్‌కు మురికి బట్టలను తీసుకొని వస్తే పూర్తిగా ఇస్త్రీ చేసుకొని బయటకు వెళ్లేలా తీర్చిదిద్దారు. బట్టలు ఉతకడం, డ్రయ్ చేయడంతోపాటు ఇస్త్రీ చేసుకునేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. చీరెలు, దుప్పట్ల కోసం ప్రత్యేక యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. 3 వాషింగ్ మిషన్లు, మూడు నీటిని తొలగించే యంత్రాలు, రెండు డ్రయ్యర్ యంత్రాలు, ఒక సారీరోలర్, ఒక బెడ్‌షీట్ రోలర్, నాలుగు ఇస్త్రీ టేబుల్స్‌ను అందించారు. ఆఫీస్ గదితోపాటు ప్రత్యేకంగా టాయిలెట్స్, ఎలక్ట్రికల్ రూం, డిటర్జెంట్ స్టోర్ నిర్మించారు. ఇందులోకి వచ్చే రజకులు తమ పనులు సులువుగా చేసేకునేలా ఏర్పాట్లు చేశారు. నీటి వినియోగం తక్కువ ఉండడంతో పాటు ఉతికి ఆరవేసేలా ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. రజకులు కూడా సబ్బులు, సర్ఫ్ ముట్టకోకుండా యంత్రాల ద్వారా చేసుకునే వీలుంటుంది. వానకాలంలో బట్టలు ఆరలేదన్న సమస్య కూడా రాదు. అలాగే, నగరంలోని వివిధ దవాఖానల నుంచి తీసుకు వచ్చే బట్టలు, బెడ్షీట్లను సాధారణ బట్టలతో కలిపి ఉతకకుండా ప్రత్యేకంగా సేకరించి ఉతికేలా చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలోనే అన్ని సౌకర్యాలతో కూడిన అతి పెద్ద ఆధునిక దోభీఘాట్ కరీంనగర్లో అందుబాటులోకి తీసుకుచ్చాం. కులవృత్తులను గర్వంగా చేసుకోవాలనే ఆలోచనతోనే దోభీఘాట్‌ను నిర్మంచి అధునాతన యంత్రాలు ఏర్పాటు చేశాం. అందులో ఒక గంటకు 240 దుస్తులు, ఒక రోజులో 2500 దుస్తులు వాషింగ్ చేసుకునేలా యంత్రాలను, టంబల్ డ్రయ్యర్ యంత్రాలను, సారీ, బెడ్ షీట్ రోలర్ ఐరన్ టేబుల్స్, వాక్యూమ్ ఐరన్ టేబుల్స్ యంత్ర సౌకర్యం కల్పించాం. నగరంలోని లోలెవల్ ప్రాంతంలో మరో మోడ్రన్ దోభీఘాట్ నిర్మాణానికి గతంలోనే చర్యలు చేపట్టాం. స్థలం లేక ఆలస్యమవుతున్నది. స్థలం కేటాయించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరాం.