సుల్తానాబాద్ రూరల్, మార్చి 15: ఎస్ఆర్ఎస్పీ కాలువ నీళ్లు రావడంలేదని పలు గ్రామాల రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందించాల్సి ఉండగా, తక్కువగా నీరు విడుదల చేయడంతో చివరి భూముల వరకు సాగునీరు అందడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు ఎక్కువగా విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల, రాముని పల్లి, తొగర్రాయి, జెండాపల్లి, మంచరామి గ్రామాల రైతులకు ఎస్ఆర్ఎస్పీ డీ-86 నుంచి ఉపకాలువ ద్వారా 32 ఆర్ కాలువ చివరి భూములకు నీళ్లు రావడంలేదని శనివారం ఆయా గ్రామాలకు చెందిన పలువురు రైతులు కర్రె కుమార్ శెట్టి, రాజయ్య శెట్టి, అశోక్, ఎగుర్ల రాజయ్య, చుక్క బీరయ్య, అప్పల రాజ్ కుమార్, అంగడి మొడ్డయ్య, కర్రె రమేష్, ఐలయ్య తదితరులు కనుకుల పరిధిలోని 32 ఆర్ కాలువ వద్ద నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దాదాపుగా దాదాపు200 ఎకరాలపై చిలుకు భూముల్లో మొక్కజొన్న సాగు చేశామని చెప్పారు. చేతికి వచ్చే దశలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో సాగునీరు అందిస్తేనే పంటలను కాపాడుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 ఎకరాల్లో వరి సాగు చేశామని, 32ఆర్ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీళ్లు రాక పొట్ట దశకు వచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడులు సైతం వస్తాయో, రావోనని వాపోతున్నారు.
అధికారులు అవగాహన లేకుండానే ముందస్తుగా ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఎక్కువగా విడుదల చేశారని రైతులు చెప్పారు. అవసరమైన సమయంలో ఎక్కువ నీరు విడుదల చేయడం లేదన్నారు. దీనివల్ల తాము నష్టపోవడం తప్ప, వేరే దారి లేదన్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే నీళ్లు ఎక్కువగా వదులుతామని చెప్పారు కానీ ఆయకట్టు చివరి వరకు నీళ్లు రావడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాగునీరు అందించి తమను ఆదుకోవాలని కోరారు.