కరీంనగరంలో తాగునీటి సరఫరాగాడి తప్పుతున్నది. అధికారుల సమన్వయ, ప్రణాళికా లోపాలతో ఎద్దడి మొదలవుతున్నది. ఎల్ఎండీలో రోజురోజుకూ నీటి నిల్వలు పడిపోతుండడం, అధికారుల ముందస్తు సమ్మర్ ప్లాన్ లేకపోవడంతో ఇప్పటికే పలు రిజర్వాయర్ల పరిధిలో రోజు తప్పించి రోజు నీరు వస్తున్నది. నేటి నుంచి అన్ని కాలనీల్లోనూ ఇలానే ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుండగా, మున్ముందు తాగునీటి ముప్పు తీవ్రమయ్యే కనిపిస్తున్నది.
కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 27 : కేసీఆర్ పాలనలో మండు వేసవిలో కూడా కరీంనగర ప్రజలకు ప్రతి రోజూ మంచినీటి సరఫరా అయ్యేది. అందుకోసం ముందస్తుగానే సమ్మర్ ప్లాన్ సిద్ధం చేసేది. ఎల్ఎండీలో అవసరమైన మేరకు నీటి నిల్వలు ఉంచేది. కానీ, ప్రస్తుతం నగరపాలక సంస్థలో అవేవీ కనిపించడం లేదు. ఓ వైపు ఎల్ఎండీలో నీటిమట్టం రోజురోజుకూ పడిపోతున్నా ముందస్తు జాగ్రత్తలు కనిపించడం లేదు. అలాగే సమ్మర్ ప్లాన్‌పై ఇంజినీరింగ్ విభాగం ఇప్పటి వరకు దృష్టి సారించిన దాఖలాలు లేవు.
నగరంలో 62 వేల నల్లా కనెక్షన్లు ఉండగా, ప్రతి రోజూ 60 ఎంఎల్డీ నీటి సరఫరా చేస్తున్నారు. నగరంలోని అంబేద్కర్ నగర్, రాంపూర్, మార్కెట్ రిజర్వాయర్ పరిధిలో ఈ నెల మొదటి నుంచే రోజు తప్పించి రోజు మంచినీటి సరఫరా చేస్తున్నారు. ఇటీవల ఎస్సారార్, కోర్టు రిజర్వాయర్ల పరిధిలోనూ రోజు తప్పించి రోజు నీటి సరఫరా చేపడుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో రోజూ నీటి సరఫరా చేస్తున్నా ఇబ్బందులు మాత్రం వస్తూనే ఉన్నాయి.
నగరంలో ప్రస్తుతం సాగిస్తున్న రోజూ మంచినీటి సరఫరాకు నగరపాలక అధికారులు మంగళం పాడేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి అన్ని ప్రాంతాల్లో రోజు తప్పించి రోజు మంచినీటి సరఫరా చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే నీటి సరఫరా విభాగంలోని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం కాగా, ఈ విషయంలో ఇంజినీరింగ్ విభాగంలోని రిజర్వాయర్ల వారీగా ఉన్న అధికారుల్లో ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు.
ఇక నుంచి రోజు తప్పించి రోజు నీటి సరఫరా అవుతుందని కొందరు చెబుతుంటే.. మరి కొందరు ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్నారు. ఏడాదిన్నర కింద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మే నెలలో రోజు విడిచి రోజు నీటి సరఫరా చేశారు. అయితే ఈ సారి మాత్రం వేసవిలో మార్చి చివరి నుంచే చేసే ఈ పరిస్థితి రావడంపై విమర్శలు వస్తున్నాయి.
నగరంలో పరిస్థితి చూస్తే రానున్న రోజుల్లో తాగు నీటి సరఫరాకు మరిన్ని తిప్పలు వచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే అనేక శివారు కాలనీల్లో నల్లా నీరు తగినంత ప్రెషర్ రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వీటికి తోడు పైపులైన్ల లీకేజీ కూడా పెరిగిపోతుండడం.. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోవడంతో కిసాన్‌నగర్, తదితర ప్రాంతాల్లో మురుగునీరు వస్తుందన్న ఫిర్యాదులు ఉన్నాయి. వీటితోపాటు ఆరెపల్లి, సీతారాంపూర్, విద్యానగర్, తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ప్రెషర్ ఉండడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి.
దీనికి తోడు రిజర్వాయర్ల పంపింగ్ విషయంలో ఇంజినీరింగ్ అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో నీటి సరఫరా విషయంలోనూ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వేసవి విషయంలో ప్రత్యేక దృష్టి సారించకపోతే నీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు వచ్చే ప్రమాదమున్నది.