కోరుట్ల/ మారుతీనగర్, నవంబర్ 9: ‘కాంగ్రెస్, బీజేపీలతో ఒరిగేదేం లేదు. ఆ పార్టీ నాయకులకు ఏది చేతకాదు. అది చేస్తాం.. ఇది చేస్తామని నానా హంగామా చేయడం తప్ప ఆచరణ సాధ్యంకాదు. వాళ్లు ఇచ్చేవన్నీ ఫేక్ హామీలే. వారు ఏండ్లకొద్ది పాలిస్తున్న రాష్ర్టాల్లో పనులు చేయనోళ్లు.. పథకాలు అమలు చేయనోళ్లు.. మన దగ్గర ఎట్ల చేస్తరు.. నేనొక్కటే చెబుతున్నా.. వాళ్ల మాటలు నమ్మితే మోసపోతరు.. జాగ్రత్త’ అంటూ కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రజలను అప్రమత్తం చేశారు. గురువారం ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతో కలిసి కోరుట్ల పట్టణంలోని పూసల, దూదేకుల సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే మెట్పల్లి పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ గార్డెన్లో తెలంగాణ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. తనను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి మద్దతు తెలుపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో సంజయ్ మాట్లాడారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.
అన్ని కులసంఘాలకు భవన నిర్మాణాల కోసం నిధులు ఇచ్చారని, ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చారని చెప్పారు. కోరుట్లలో వంద పడకల దవాఖాన, మద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్, సెంట్రల్ లైటింగ్, బీటీ రోడ్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని చెప్పారు. తాను ఇక్కడే పుట్టిన పుట్టి పెరిగానని, ప్రజల కష్టాలు, కన్నీళ్లు తెలుసునని, ఆశీర్వదించి గెలిపించాలని సూచించారు. కాగా, ఐదేళ్లకోసారి వచ్చి ప్రజలకు కనిపించే టూరిస్టు నేతలకు తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు.
విద్యావంతుడు అందరికీ అందుబాటులో ఉండే స్థానికుడు తన కుమారుడు బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌ని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా మెట్పల్లిలో డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అభ్యర్థి సంజయ్‌ను శాలువాలతో సత్కరించారు. పలువురు డ్రైవర్ అసోసియేషన్ నాయకులు ఆయనతో సెల్ఫీ తీసుకొని అభిమానాన్ని చాటుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్లు జిందం లక్ష్మీనారాయణ, సజ్జు, బీఆర్ఎస్ మైనార్టీ పట్టణాధ్యక్షుడు ఫహీం, నాయకులు పుప్పాల ప్రభాకర్, అన్వర్, మోసిన్, అమేర్, ఆయా కుల సంఘాల సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నవయువ తెలంగాణ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శివలాల్, సంపత్‌గౌడ్, గణేశ్, యూనియన్ సభ్యులు రాజ్‌కుమార్, ముజీబ్, బిగ్‌బాస్, సాయిలు, రవీందర్, రామకృష్ణ, దివాకర్, శ్యాం, మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రావు, ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్ పూదరి సుధాకర్‌గౌడ్, తదితరులు ఉన్నారు.