Double bedroom houses | సిరిసిల్ల రూరల్, జూలై 12: బీఅర్ ఏస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజక వర్గం లో కక్ష్య సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ హయాంలో కేటీఆర్ ప్రత్యేక చొరవతో తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను శనివారం ఇందిరమ్మ ఇళ్ల పేరిట లబ్ధిదారుల ఎంపిక తో పాటు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అధికారిక కార్యక్రమంలో మళ్లీ ప్రొటో కాల్ ఉల్లంఘన వివాదాస్పదమైంది. ఈ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ చిత్రంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో లేకపోవడం గమనార్హం.
అంతేకాదు ఎలాంటి పదవి లేకపోయినా స్థానిక కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయడం, సాక్షాత్తు కలెక్టర్ పక్కనే కూర్చుని పెట్టుకొని అధికారిక కార్యక్రమం నిర్వహించడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే .. శనివారం తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జిల్లెల్ల లో కేసీఆర్ హయాంలో నిర్మించిన 26 డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కలెక్టర్ సందీప్ కుమార్ఝా, కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, డీపీవో, ఎంపీడీవో, మార్కెట్ కమిటీ పాలకవర్గం, స్థానిక మండల కాంగ్రెస్ నాయకులతో నిర్వహించారు. లబ్ధిదారులను డ్రా తీసి ఎంపిక చేశారు. అనంతరం ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అంతకుముందు మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణం లో జిల్లెల్ల కు చెందిన పలువురు చేరుకొని, తమను జాబితా లోంచి కావాలనే తొలగించారని దుబ్బాక మల్లవ్వ, కడమంచి రాజు, అనూష, ఎండీ మదిన, పాశం సంధ్య, బర్ల లక్ష్మి, తదితరులు ఆందోళన చేశారు.
వారిని పోలీసులు అడ్డుకుని శాంతింప చేశారు. తమకు అన్ని అర్హతలు ఉన్నా బాబితాలో నుండి పేర్లు తొలగించారని అక్కడే కన్నీటి పర్వతం కావడం పలువురిని కలిచి వేసింది. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.