హుజూరాబాద్/ ఇల్లందకుంట ఏప్రిల్ 29 : అర్హులమైనా తమకు ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు మంజూరు చేయలేదని మంగళవారం పలువురు ఆందోళనబాట పట్టారు. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు మంజూరయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు రోడ్డెక్కి ధర్నా చేశారు. మహిళలు వాటర్ ట్యాంక్ ఎకేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని కిందికి దించారు.
ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నోళ్లకే ఇల్లు మంజూరు చేశారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇచ్చింది ఏమీ లేదని అగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో కాంగ్రెస్ వాళ్లు నాలుగు బ్యాచులుగా విడిపోయి వాళ్లకు కావాల్సిన వారికి ఇళ్లు ఇప్పించుకున్నారని వాపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ధర్నా విరమింపజేశారు.
జమ్మికుంటలో దివ్యాంగుడు
జమ్మికుంట ఏప్రిల్ 29 : ఆబాది జమ్మికుంటకు చెందిన దివ్యాంగుడు దొంకటి కోటేశ్వర్ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని ఆందోళన చేశాడు. అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో బల్దియా కార్యాలయం పైకి ఎక్కి తన నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా కోటేశ్వర్ మాట్లాడుతూ, తన అమ్మ మధునమ్మ, తాను ఇద్దరం దివ్యాంగులమని, తనకు పెళ్లయిందని, ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నానని, రేకుల షెడ్డులో ఉంటున్నాని చెప్పాడు. ఇటీవల 160 మందికి ఇండ్లు వచ్చినట్టు పేర్లు చదివారని, అందులో త న పేరు లేదని సర్వే అధికారులను ప్రశ్నిస్తే.. ‘కాంగ్రెస్ నాయకులు ప్రణవ్ లిస్టు ఇ చ్చాడు.
ఆయనను అడుక్కో’ అని చెప్పడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మున్సిపల్ కార్యాలయానికి వస్తే ఎవరూ పట్టించుకోలేదని, చేసేదేమీ లేక మున్సిపల్ కార్యాలయం ఎక్కి నిరసన తెలిపానని చెప్పాడు. దివ్యాంగులకు 5 శాతం కోటా కింద తనకు రావాల్సి ఉండగా.. తనకే కాదు, ఏ ఒక్క దివ్యాంగుడికీ ఇల్లు రాలేదని తెలిపాడు. తన పేరు అధికారులు, కాంగ్రెస్ నాయకులు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ లీడర్లకే ఇళ్లు వచ్చాయని, వాళ్ల తల్లిదండ్రులు, భూస్వాములకే ఇచ్చారని పేర్కొన్నాడు. తనలాంటి దివ్యాంగుడికి ఒక్క ఆసరా పింఛన్ తప్ప ఏ ప్రభుత్వ పథకం చేరడం లేదన్నాడు. తనకు న్యాయం జరగకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించాడు. కాంగ్రెస్ నాయకులు, అధికారులు డౌన్‌డౌన్ అంటూ నినదించాడు. అనంతరం అధికారులు, సిబ్బంది దివ్యాంగుడితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించాడు.