Retired employee | పెద్దపల్లి, అక్టోబర్4: 30 నుంచి 40 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసి పదవీ విరమణ పొంది కృష్ణా రామా అంటూ, తీర్థ యాత్రలు తిరుగుతూ, మనుమలు మనుమరాళ్లతో ఆనందంగా గడిపే వయస్సలో ప్రభుత్వ కార్యాలయాల చూట్టు తిరుగే దయనీయ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఎనాడూ అనుకోలేదని పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అవేదన చెందుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదని మండి పడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దుంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రిటైర్మెంట్ ఉద్యోగులకు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకు రిటైర్మెంట్ ఎంప్లాయిస్ వేల్పేర్ అసోసియేషన్(రెవా) ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 7న ఉమ్మడి పది జిల్లాల కలెక్టరేట్ల ఎదుటు ధర్నా చేసేందుకు సిద్ధం అవుతన్నారు.
30 నుంచి 40 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు వెంటనే పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలని రిటైర్డు ఉద్యోగుల సంక్షేమ సంఘం (రెవా) ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొహెడ చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవీ విరమణ చేసిన నాడే ఉద్యోగ ప్రయోజనాలు ఉద్యోగి ఖాతాలో జమచేయాలని చట్టాలు చెబుతున్న ప్రస్తుత పాలకులు మాత్రం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని మండి పడ్డారు. ప్రజాపాలనలో 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఏడాదిన్నరగా రిటైర్మెంట్ బెనిఫిట్లు అందకపోవటం సిగ్గు చేటు అన్నారు.
గ్రాట్యూటి, కమ్యూటేషన్, జీపీఎఫ్, జీఐఎస్, నగదు సెలవులు వంటి బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. గ్రాట్యూటీ కింద కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షలు ఇస్తుండగా, రాష్ర ప్రభుత్వం మాత్రం రూ.16 లక్షలు చెల్లించి చేతులు దులుపుకుంటందని దుయ్యబట్టారు. పదవీ విరమణ ప్రయోజనాలు అందుతాయో లేదో అనే బెంగతో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు మానసిక ప్రశాంతతా కరువై తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇళ్లు కట్టడానికో, కూతురు పెండ్లికో ఉపయోగపడుతాయని ప్లాన్ చేసుకుంటే.. ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా తాత్సారం చేస్తుందన్నారు.
ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించాలని లేనిపక్షంలో అమర నిరహర దీక్ష చేయటానికి సిద్ధమని హెచ్చరించారు. ఇందులో భాగంగా ఈనెల 7న కరీంనగర్ కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో రిటైర్డు ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి శుంకిశాల ప్రభాకరరావు, కోశాధికారి కనపర్తి దివాకర్, కమిటీ సభ్యులు వెంకట్ రెడ్డి, కోడం వెంకట రాములు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.