Uttam Kumar Reddy | పెద్దపల్లి, ఏప్రిల్19: జిల్లాలో యాసంగి సీజన్ వరి ధాన్యాన్ని ప్రణాళికాబద్ధంగా కొనుగోలు చేయాలని, తాలు తరుగు పేరిట ఎటువంటి కోతలు పెట్టోందని రాష్ర్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి సన్న బియ్యం సరఫరా, ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌తో కలిసి మంత్రి కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్షించారు.
పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలుపై మంత్రి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. వీసీలో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలో యాసంగి పంట సీజన్లో 4.5 లక్షల మెట్రిక్ టననల ధాన్యం కొనుగోలు లక్ష్యమని, వీటిలో సన్న రకం ధాన్యం 1.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని వివరించారు. ఇప్పటికే 300ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు.
టార్ఫాలిన్ కవర్, గన్నీ బ్యాగులు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్, ఇతర పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. జిల్లాలో రైస్ మిల్లర్లతో కూడా ఎటువంటి సమస్యలు లేవని 100 మంది రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలతో సిద్ధంగా ఉన్నారని, రైస్ స్టోరేజీ, మిల్లింగ్‌కు ఎటువంటి సమస్య లేదని తెలిపారు. కోనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవసరమైన శిక్షణ అందించామని చెప్పారు. వీసీలో కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో పాటు పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎం శ్రీకాంత్, డీఎంవో ప్రవీణ్ కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్, జిల్లా సహాకార అధికారి శ్రీమాల, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గంగాధర శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.