సిరిసిల్ల రూరల్, జనవరి 20: ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సర్కారు పెడుతున్న అక్రమ కేసులకు భయపడవద్దని, ధైర్యంగా ఉండాలని పార్టీ శ్రేణులకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. ఇటీవల తంగళ్లపల్లి మండలంలో పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మండలకేంద్రానికి చెందిన మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య ఇటీవలే బెయిల్‌పై విడుదలై రాగా, సోమవారం ఆయన నివాసానికి వెళ్లి వినోద్‌కుమార్ పరామర్శించారు.
ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేశామని, ఎన్నో కేసులను ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నదని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఆయన వెంట బొల్లి రామ్మోహన్, సింగిల్‌విండో చైర్మన్ బండి దేవదాస్‌గౌడ్, కోడూరి భాస్కర్‌గౌడ్, బండి జగన్, శ్రీకాంత్‌రెడ్డి, రవీందర్రావు ఉన్నారు.