బీఆర్ఎస్ దండు కదిలింది. కాంగ్రెస్ సర్కారు మోసంపై కన్నెర్రజేసింది. గత ప్రభుత్వంలో విజయవంతంగా అమలైన రైతు భరోసా(రైతు బంధు) ‘ఈ వానకాలం లేదు. వచ్చే యాసంగి నుంచి అమలు చేస్తామన్న’ మంత్రి తుమ్మల ప్రకటనపై భగ్గుమన్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేసింది. పలుచోట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసింది. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినదానికంటే ఎక్కువగా ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఇప్పటివరకు ఒక్క పంటకు కూడా ఇవ్వకపోవడంపై ఆగ్రహించింది. వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
కరీంనగర్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలోని దాదాపు అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ఆందోళనలు చేపట్టారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్ వై సునీల్‌రావు, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సైదాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. మానకొండూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్, జగిత్యాల రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. వీణవంక, ఇల్లందకుంట, శంకరపట్నం మండల కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున రాస్తారోకోకు దిగారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో బీఆర్ఎస్పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. పెద్దపల్లిలోని అంబేద్కర్ చౌక్‌లో రాజీవ్ రహదారిపై మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని సిరిసిల్ల మానేరు బ్రిడ్జిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు. జగిత్యాల కేంద్రంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసి, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
కాంగ్రెస్‌కు ఓట్లు వేసినందుకు రేవంత్ సర్కారు నమ్మించి రైతుల గొంతు కోసింది. రైతులతోపాటు అన్ని వర్గాలను ంగ్రెస్ వంచించింది. మాటలు గారడీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నది. వానకాలం రైతు భరోసా వస్తుందని రైతులు ఆశపడి అప్పులు తెచ్చి సాగు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అప్పు చెల్లించవచ్చని అనుకున్నారు. కానీ, కోతలు అయిపోయి కల్లాల వద్దకు వడ్లు తరలిస్తున్న సమయంలో రైతు బరోసా ఇవ్వకపోవడమే కాకుండా వచ్చే సీజన్లో ఇచ్చేందుకు సబ్‌కమిటీ నివేదిక ప్రకారం నిర్ణయం ఇస్తామని చెప్పి రైతుల ఆశలను అడియాసలు చేసింది. సావు కబురు చల్లగా చెప్పారు. ఒక రైతులనే కాకుండా నిరుద్యోగ యువత, మహిళలు, ఉద్యోగులు, సింగరేణి కార్మికులను కూడా ఈ సరారు మోసం చేసింది.