కరీంనగర్‌లోని జిల్లా కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులు, పాఠకులు బాసటగా నిలుస్తున్నది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 24 గంటల పాటు చదువుకునేలా ఏర్పాట్లు చేసింది. ఉచిత భోజనం, టీ సదుపాయం కల్పించడమే కాకుండా, మంచి వాతావరణంలో చదువుకునేలా సౌకర్యాలు కల్పించింది. దీంతో ఇక్కడికి వచ్చి చదువుకునేందుకు యువతీ యువకులు పోటీ పడుతుండగా, ఎంత మంది వచ్చినా అసౌకర్యం కలుగకుండా వారి ఉద్యోగ లక్ష్య సాధనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
Library | తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలోని గ్రంథాలయాలకు మహర్దశ వచ్చింది. గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలని గుర్తించిన ప్రభుత్వం పాఠకులకు, నిరుద్యోగులకు అనుగుణంగా వాటిని ఆధునీకరించింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్మార్ట్‌సిటీ నిధులతో రూ.7 కోట్లతో ఆధునీకరిస్తున్నది. ఇప్పటికే కొన్ని పూర్తి దశకు చేరగా, మరిన్ని పనులు శరవేగంగా సాగుతున్నాయి. గ్రంథాలయంలో పుస్తకాల డిజిటలైజేషన్, నిర్మాణ పనులు సైతం చివరిదశకు చేరాయి.
నిరుపేద విద్యార్థుల కోసం..
రాష్ట్రంలో పోలీస్, గ్రూప్స్‌తోపాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు లక్షకుపైగా ఉద్యోగాల భర్తీకి నిర్ణయించి, ఇప్పటికే కొన్ని పోటీ పరీక్షలు నిర్వహించాంది. మరికొన్ని దశలవారీగా నిర్వహిస్తున్నది. దేశంలో ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా పెద్ద మొత్తంలో ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించడంతో కొలువుల కల సాకారం చేసుకోవడమే లక్ష్యంగా నిరుద్యోగులు, యువతీ యువకులు సిద్ధమయ్యారు. ఇలాంటి వారికి జిల్లాలోని కేంద్ర గ్రంథాలయం బాసటగా నిలుస్తున్నది. వారికి అనువుగా ఉండేందుకు కరీంనగర్‌లోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని 24 గంటల పాటు తెరిచే ఉంచుతున్నారు ఇక్కడి గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉద్యోగులు. గత సంవత్సరం నుంచే ఈ వెసులుబాటును కల్పించారు. 24 గంటల పాటు ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు మెస్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం, నగరపాలక సంస్థ సహకారంతో రూ.5 మధ్యాహ్న భోజన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రంథాలయానికి వచ్చేవారిలో ఎక్కువగా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఉండటంతో కలెక్టర్ చొరవతో మరో చక్కటి అవకాశానికి శ్రీకారం చుట్టారు.
వారధి సొసైటీ సహకారంతో గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఉచితంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఇక్కడ ఇటీవలే శ్రీకారం చుట్టారు. మే మొదటి వారం నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. అలాగే, 24 గంటల పాటు చదువుకుంటున్న విద్యార్థుల కోసం సాయంత్రం వేళల్లో టీ అందిస్తున్నారు. ఇక్కడికి ప్రతిరోజూ 1500 మందికి పైగా నిరుద్యోగులు, పాఠకులు, యువతీ యువకులు వచ్చి చదువుకుంటున్నారు. ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లిషు, సంస్కృతం, తమిళానికి సంబంధించిన సుమారు లక్ష పుస్తకాలు ఇక్కడ విద్యార్థుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచారు. మహిళలు, యువతుల కోసం ప్రత్యేకంగా రెండు గదులను కేటాయించి వారు చక్కగా చదువుకొనేందుకు సహకరిస్తున్నారు. పాఠకుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఆరుబయట విద్యార్థుల సౌకర్యార్థం హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేసి 24 గంటల పాటు చదువుకొనేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చేపట్టిన పనులతో ఈ గ్రంథాలయం రాష్ట్రంలోనే మంచిపేరును సంపాదించింది.
ఎంతైనా చేసేందుకు సిద్ధం
విద్యార్థి ఉద్యమ నాయకుడిగా నాకు నిరుద్యోగుల కష్టాలు తెలుసు. వారి కోసం నా పరిధిలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఎంతైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఉద్యోగ నియామకాలతో గ్రంథాలయాలకు నిరుద్యోగుల తాకిడి పెరగడంతో ప్రభుత్వ, నగరపాలక సంస్థ సహకారంతో ఇక్కడ గతంలో రూ.5 భోజన పథకాన్ని ప్రారంభించారు. అయితే, ఉచితంగా భోజనం అందించాలని కలెక్టర్‌ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించి మే మొదటివారం నుంచి ఉచిత భోజననానికి శ్రీకారం చుట్టారు. 24 గంటల పాటు చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగవద్దని దాతల సహకారంతో అల్పాహారం, ప్రతి రోజూ ఉచిత భోజనం, సాయంత్రం వేళల్లో టీ అందజేస్తున్నాం. విద్యార్థులు ఇక్కడున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విజయం సాధించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలి. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, కలెక్టర్ కర్ణన్ సహకారంతో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తా.
– పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, కరీంనగర్
ఇక్కడ ఉన్న సౌకర్యాలు మరెక్కడా లేవు
కరీంనగర్‌లోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉన్న సౌకర్యాలు మరెక్కడా లేవు. 24 గంటలు చదువుకొనే సదుపాయం రాష్ట్రంలో ఇక్కడ మాత్రమే ఉంది. అలాగే, విద్యార్థులకు ఉచిత భోజనం, టీ సదుపాయం కల్పిస్తున్నది ఇక్కడే. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు అనుగుణంగా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. అడిగిన వెంటనే పుస్తకాలను కొనుగోలు చేసి ఇస్తున్నారు. ఇక్కడి సౌకర్యాలను వినియోగించుకొని ఉద్యోగాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉన్నది.
ఉచిత భోజనం గొప్ప నిర్ణయం
నిరుద్యోగులకు, గ్రంథ పాఠకులకు ఉచిత భోజనం అందించడం గొప్ప నిర్ణయం. ఎందుకంటే గ్రంథాలయానికి వచ్చేవారిలో ఎక్కువ మంది నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఉంటారు. భోజనం కోసం బయటకు వెళ్లాలంటే రూ.100 వరకు అవుతుంది. ఈ ఖర్చు విద్యార్థులకు ఇబ్బందే. మా సౌకర్యం కోసం గతంలో ఇక్కడ రూ.5 భోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. గ్రంథాలయానికి వచ్చి చదువుకొనే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఇప్పుడు కలెక్టర్ సహకారంతో ఈ భోజనాన్ని ఉచితంగా పెడుతుండటం సంతోషంగా ఉంది. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే ఉద్యోగార్థులకు వరంగా మారుతుంది.
– ఎం శ్యాం, కాటారం
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే సాధ్యం
జిల్లా కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగులకు వరంగా మారడానికి ప్రభుత్వం ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా తెలంగాణాలో ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ నిర్ణయించడం హర్షనీయం. ఈ నిర్ణయం నిరుద్యోగ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో నియామకాలు జరిపిన సందర్భాలు లేవు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధియే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుండగా దానికి అనుగుణంగాగ్రంథాలయాల్లో అన్ని సౌకర్యాలు చేరువయ్యాయి.
– శ్రీలత, రేకుర్తి
యువతుల కోసం ప్రత్యేక గదులు
కేంద్ర గ్రంథాలయంలో ఆరు గదులుండగా మహిళలు, యువతుల కోసం ప్రత్యేకంగా రెండు గదులను కేటాయించారు. ఇవి పూర్తిగా మాకే. ప్రశాంతంగా చదువుకొనేందుకు దోహదం చేస్తాయి. ప్రైవేట్ హాస్టల్స్, రూంలలో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గ్రంథాలయం ఒక దేవాలయంగా మారింది. 24 గంటల్లో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి చదువుకొనే అవకాశం ఉంది. ఒకసారి గ్రంథాలయంలోకి అడుగు పెడితే ఇక్కడే ఉచిత భోజనం, టీ, మంచినీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఆధునిక సౌకర్యాలతో అధునాతన గ్రంథాలయం అందుబాటులోకి వస్తే మరిన్ని సౌకర్యాలు నిరుద్యోగులకు చేరువవుతాయి.
– కే మానస, జగిత్యాల