Valmiki Avasam | జగిత్యాల, జూలై 25 : సేవా భారతి ఆధ్వర్యంలో గ్రామీణ నిరుపేద, దళిత విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వాల్మీకీ ఆవాస విద్యార్థులకు యశస్వి ఎలక్ట్రానిక్స్ అధినేత కోటగిరి శ్రీనివాస్-మంగ దంపతులు పాఠశాల యూనిఫామ్స్ అందజేశారు. శ్రీనివాస్ తల్లి వరలక్ష్మి జ్ఞాపకార్థం ఆవాసంలోని 65 మంది విద్యార్థులకు రూ.50వేల విలువచేసే దుస్తులను కోటగిరి రామేశ్వర్, కోటగిరి యశస్వి-శ్రావ్య, దంపతులు శుక్రవారం ఆవాసంలో నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు.
ఈ సందర్భంగా వాల్మీకీ ఆవాసం కార్యదర్శి నందెల్లి మదన్మోహన్ రావు మాట్లాడుతూ గ్రామీణ నిరుపేద, నిరక్షరాస్య కుటుంబాలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేసి వాల్మీకీ ఆవాసంలో ఉచిత విద్య, వసతితో పాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. సమాజంలోని దాతల సహకారంతో ఆవాస విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి, సంస్కారంతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. కోటగిరి యశస్వి మాట్లాడుతూ విద్యార్థులు తమ ముందున్న లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కష్టపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆవాస సభ్యులు ఎన్నమనేని అశోక్ రావు, సంపూర్ణ చారి, హరీష్, వెంకటేశ్వరరావు, సత్యం, ఆవాస ప్రముఖ్ సుద్దాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.