Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 15: విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో సోమవారం చిగురుమామిడి మండలంలోని 32 ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తరగతి గదులలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. 6 నుండి 10 వరకు 12 వేల పుస్తకాలు, 20,000 నోట్ బుక్స్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల పాఠశాలలో విద్యార్థులకు అందజేశారు.
చిగురుమామిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఆకవరం భవాని హాజరయ్యారు.ప్రభుత్వ పాఠశాలలో అందించే మౌలిక వసతులను, నాణ్యమైన విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మహమ్మద్ ఇర్షాద్, ఉప సర్పంచ్ విజయలక్ష్మి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గొల్లపల్లి అరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.