కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 14 : ‘సంపూర్ణ పౌష్టికాహారంతోనే చిన్నారుల్లో శారీరక వికాసం కలుగుతుంది. సరైన సమయంలో బలవర్ధకమైన ఆహారం అందిస్తే ఎదుగుదల బాగుంటుంది. పిల్లల్లో చురుకుదనం పెరుగుతుంది. తద్వారా వారికి ఎదుటివారు చెప్పే అంశాలపై అవగాహన వచ్చి, చదువుపై ఆసక్తి ఏర్పడుతుంది. అందుకోసమే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకందించే పౌష్టికాహార మెనూలో మార్పులు తెస్తున్నాం. ప్రసుత్తం అందజేస్తున్న ఆహారంతోపాటు వారానికి రెండు రోజులు ఎగ్బిర్యానీ అందజేసేందుకు శాశ్వత కార్యాచరణ పథకం రూపొందించాం’ అంటూ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ గత విద్యాసంవత్సరం ముగింపు దశలో ప్రకటించారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో ‘అమ్మ మాట.. అంగన్వాడీ బాట’ కార్యక్రమం అనంతరం కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ పథకం అట్టహాసంగా ప్రారంభించారు. సూపర్వైజర్ల నుంచి మొదలు కలెక్టర్ దాకా పాల్గొని, పునఃప్రారంభ సమయంలో చిన్నారులకు గుడ్డు బిర్యానీ అందించారు.
కేంద్రాలకు వచ్చే చిన్నారులు ఆనందంతో బిర్యానీ తినగా, అధికారులు మెనూ మార్చినట్లు ప్రకటించారు. చిన్నారుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు పౌష్ఠికాహారం అందుతుందని సంతోషించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో వారానికి ఒకరోజైనా చిన్నారులకు ఎగ్ బిర్యానీ కచ్చితంగా పంపిణీ చేయాలంటూ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కానీ, ఆ తర్వాత మారిన మెనూపై పర్యవేక్షణ లేకపోవడంతో ఎగ్ బిర్యానీ కథ కంచికి చేరింది. ఈ పథకానికి ఎలాంటి అదనపు కేటాయింపుల్లేకపోవడం, బిర్యానీ తయారు చేసేందుకు అవసరమైన సామగ్రి పంపిణీ చేయకపోవడం, ఈ ఖర్చు మొత్తం అంగన్వాడీ కేంద్రాల్లోని టీచర్లే భరించాల్సి రావడం భారంగా మారి చేతులెత్తేశారు. దీంతో, ఈ పథకం అమలు ఆరంభశూరత్వంగా మారగా, ఎగ్ బిర్యానీ పథకం ఒక్కరోజు ముచ్చటగా మారిందని చిన్నారుల తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో 777 అంగన్వాడీ కేంద్రాలుండగా, వీటిలో 19,666 మంది చిన్నారులు పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తున్నారు.
గర్భిణులు 4,587 మంది, బాలింతలు 3,579 మంది ఉండగా, వీరందరికీ గుడ్లు, పాలు, బాలామృతం, మధ్యాహ్న భోజనంతోపాటు ఇతర పోషకాలతో ఆహారం అందిస్తున్నారు. బాలింతలు, గర్భిణులు, మూడేళ్లలోపు పిల్లలకు నెలకు 16 గుడ్లు, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు రోజుకో గుడ్డు చొప్పున అందజేస్తున్నారు. అయితే, నిత్యం ఒకే రకంగా పౌష్టికాహారం పంపిణీ చేస్తుండగా, కొంతమంది పిల్లలు కేంద్రాల్లో భోజనం చేసేందుకు అయిష్టత కనబరుస్తుండేవారు. కేవలం గుడ్లు మాత్రమే తీసుకెళ్తూ, మిగతా ఆహారం అక్కడే వదిలి వెళ్తుండడం సాధారణంగా మారింది. దీనిని గమనించి మెనూ మార్చి చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అవసరమైన ఖర్చులపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
కచ్చితంగా అమలు చేయాలనే ఆదేశాలు లిఖితపూర్వకంగా కూడా విడుదల చేయలేదు. కేవలం పిల్లలకందించే గుడ్లతో మాత్రమే బిర్యానీ తయారు చేసి పంపిణీ చేయాలంటూ సంబంధిత అధికారులు టీచర్లకు సూచించడంతో ప్రారంభించిన రోజు మాత్రమే పిల్లలకు అందించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఈ పథకం కొనసాగకపోగా, పిల్లల్లో పోషకాహార లోపం కూడా పెరుగుతున్నట్లు గుర్తించామని ఆ శాఖ సిబ్బందే పేర్కొంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ పిల్లలకు సంపూర్ణ పౌష్టికాహారం అందుతుందని ఆశిస్తే, నిరాశే మిగులుతున్నదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం చెప్పే మాటలన్నీ నీటి మూటలుగానే మారుతున్నాయని మండిపడుతున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో వారానికి ఒకరోజు విధిగా ఎగ్ బిర్యానీ చిన్నారులకు అందించాల్సిందే. దీనిపై టీచర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. కేంద్రాల సందర్శన సందర్భంగా గుడ్డు బిర్యానీ అందజేతపై చిన్నారులను అడిగి తెలుసుకుంటాం. ఈ పథకం అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటాం.
– మార్త సరస్వతి, జిల్లా సంక్షేమాధికారి (కరీంనగర్)