Civil suply | కరీంనగర్ కలెక్టరేట్, మే 15 : జిల్లాలో మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కమీషన్ పంపిణీ కథ ఆటకెక్కింది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా, కలెక్టర్ ఆదేశించినా సంఘాలకు మాత్రం ఇప్పటివరకు కమీషన్ పంపిణీ చేయలేదు. రెండు రోజుల్లో విడుదల చేస్తామంటూ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గత మార్చి నెలలో కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేసినా, ప్రస్తుతం కమీషన్ అందజేత అంశాన్ని సందూకులో దాచి, తాజాగా యాసంగి కొనుగోళ్ళు కూడా వారితోనే చేయిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ నుంచి కమీషన్ విడుదలైనా ఆమొత్తాన్ని బ్యాంకుల్లో భద్రంగా దాచిపెట్టాము.
మీకు ఇప్పుడేం అవసరం అంతా కలిపి ఒకేసారి చెల్లిస్తామంటూ కొనుగోలు కేంద్రాలు నిర్వహించిన మహిళా సంఘాల ప్రతినిధులకు సమాధానం చెబుతున్నట్లు తెలుస్తున్నది. గత రెండు సీజన్ల నుంచి చెల్లింపులు చేయకపోవటంతో రూ.2.5 కోట్ల దాకా బకాయి పడగా, ఓవైపు కొనుగోళ్ళు నిర్వహిస్తూనే, మరోవైపు మహిళా సంఘాల సభ్యులు కమీషన్ కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా వారిని బుజగిస్తున్నట్లు, మరికొందరికి అస్సలు పౌరసరఫరాల శాఖ నుంచి తమకు ఇప్పటివరకు కమీషన్ అందలేదనే సమాధానం చెబుతున్నట్లు ఆశాఖ వర్గాలే పేర్కొంటుబచటం గమనార్హం.
ఆరుగాలం కష్టించి పండించిన వరి దాన్యం దళారుల పాలై, రైతులు తీవ్రంగా నష్టపోతుంటే, వారి బారి నుంచి కాపాడి దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేస్తూ, మహిళలను ఆర్థిక స్వావలంభన దిశగా తీసుకెళ్ళే క్రమంలో గత కొన్నేళ్ళుగా స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యం కొనుగోళ్ళు చేపడుతున్నారు. ధాన్యం సేకరించినందుకు మహిళా సంఘాల సభ్యులకు క్వింటాలుకు గ్రేడ్ ఏ రకానికి రూ.32, కామన్ రకానికి రూ.31,75 చొప్పున అందజేస్తున్నారు. కొమగోళ్ళు పూర్తై కేంద్రాలు మూసివేయగానే, వీరికి పౌరసరఫరాల శాఖ కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, కొద్దిగా వెనుకా ముందు అన్నట్లు ఏసీజన్లో కొనుగోలు చేసిన ధాన్యం కమీషన్ ఆసీజన్ లోనే అందజేస్తున్నా.. వీరికి అనుసంధానంగా పనిచేస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖ మాత్రం వెంటనే ఆమొత్తాన్ని సంఘాల ఖాతాల్లో జమచేయటం లేదని తెలుస్తోంది. సీజన్లకు సీజన్లు తమ వద్ద అట్టిపెట్టుకుని, ఆమొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాది, రెండేళ్ల పాటు డిపాజిట్ చేసి అనంతరం విడిపించి సంఘాలకు చెల్లించాల్సిన కమీషన్ మాత్రమే వారి ఖాతాల్లో జమ చేస్తునుట్లు సమాచారం డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ మొత్తాన్ని గ్రామీణాభివృద్ధి శాఖనే వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లాలో 2014-25 ఖరీఫ్ చెల్లించాల్సిన కమీషన్ రూ. 1,44,29,095, 2023-24 రబీ సీజన్ కు సంబందించిన కమీషన్ రూ. 95,83,320 కూడా ఇదే విధంగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ.2.39 కోట్ల వరకు పౌరసరఫరాల శాఖ విడుదల చేయగా, ఈమొత్తం కూడా వివిధ బ్యాన్కుల్లో ధరావత్తు చేసినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక్కో సీజన్లో నెలరోజులకు పైగా ఇంటిల్లి పాదిని వదిలి వేకువ జాము నుంచి అర్థరాత్రి వరకు కొనుగోలు కేంద్రాల్లో ఉంటూ, ఊడిగం చేస్తుంటే తమకొచ్చే కమీషన్ అధికారులు చెప్పాపెట్టకుండా డిపాజిట్ చేయటం వెనుక అంతర్యమేంటనే ప్రశ్నలు కేంద్రాల నిర్వాహకుల నుంచి వస్తున్నాయి.
ఓ పక్క అకాల వర్షాలు, మరోపక్క మండుటెండలను పైతం లెక్కచేయక రైతుల నుంచి వచ్చే ఒత్తిళ్ళను అధిగమించి, కొనుగోలు కేంద్రాల్లో తమ సొంత ఖర్చులతో సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వానికి పేరు తెస్తుంటే మహిళా సంఘాలకు వెన్నుదన్నుగా ఉంటున్నామని చెప్పుకునే అధికారులు తమ కమీషన్ డిపాజిట్ చేసి, వచ్చే వడ్డీని వాడుకోవటం ఏమేరకు సమంజసమో చెప్పాలంటూ మండిపడుతున్నారు. మహిళా సంఘాల కమీషన్ పెండింగ్ అంశం కలెక్టర్ దృష్టికి రాగా, మార్చి 26న గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ధాన్యం కమీషన్ వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.
రెండే రెండు రోజుల్లో పెండింగ్ కమీషన్ మొత్తం వారి ఖాతాల్లో జమచేస్తామంటూ సంబందిత అధికారులు కలెక్టర్కు సమాధానమిచ్చినా, అనంతరం పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి కమీషన్ డిపాజిట్ ద్వారా వచ్చే మొత్తం కూడా సంఘాలకే చెల్లించాల్సి ఉంటుంది. అయితే, డిపాజిట్ విషయం తెల్వని సంఘాలు తమకు రావాల్సిన కమిషన్ వస్తే సరిపోతుందనే భావనతో ఉండగా, దానిని అలుసుగా తీసుకుని నెలల తరబడి డిపాజిట్లు చేస్తూ, వడ్డీ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆశాఖనే వాడుకుంటున్నట్లు తెలుస్తున్నది.
ఈ వడ్డీకి సంబందించిన లెక్కలు కూడా ఎవరికి చూపాల్సిన అవసరం లేకపోవటంతో వడ్డీ ద్వారా వచ్చే మొత్తాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీనిపై కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారించి, వెంటనే సంఘాలకు పెండింగ్ కమిషన్ చెల్లించేలా చర్యలు పట్టాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కమీషన్ సామ్ము డిపాజిట్ చేయటం వెనుక ఉన్న బాధ్యులను గుర్తించి వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు.