Dues cards Distribution | గన్నేరువరం, అక్టోబర్ 13 : గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ అధ్యక్షుడు గంప వెంకన్న, మాజీ జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ ఎన్నికల్లో మోస పూరిత వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని కోరారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. అభివృద్ధి అంతా కేసీఆర్ పాలనలో రసమయి బాలకిషన్ చేశారని గుర్తు చేశారు. ఎన్నికల హామీలో ఇచ్చిన 6గ్యారంటిలు, 420 హామీలు నెరవేర్చి వచ్చే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ఓట్లు అడగాలన్నారు. ఎన్నికల లబ్ధి కోసం రోడ్డు వేస్తున్నట్లు నటిస్తున్నారే తప్ప రోడ్డు నిర్మాణంపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో డబుల్ రోడ్ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడెల్లి ఆంజనేయులు, పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, మీసాల ప్రభాకర్, లింగాల మహేందర్ రెడ్డి, గూడూరి సురేష్, అటికం రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.