ధర్మారం, మే 21 : తన ఆస్తులపై విచారణకు సిద్ధమని, అవసరమైతే ముఖ్యమంత్రి విచారణ జరిపించినా తనకు అభ్యంతరం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. అలాగే విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆస్తుల సంగతి తేలాల్సిందేనన్నారు. ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాల్సింది పోయి, ప్రజలను పక్కదారి పట్టించడానికి తనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటని మండిపడ్డారు. ప్రజా జీవితంలో గొప్పగా ఉండే ప్రయత్నం చేయాలని, ఈ చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. అసత్య ఆరోపణలతో అభివృ ద్ధి జరగదని చెప్పారు. అభివృద్ధిపై ధర్మారంలో మంగళవారం జరిగిన చర్చా వేదికలో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తే దౌర్జన్యంగా దాడి చేయించడాన్ని ఖండించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అభివృద్ధిపై సమాధానం చెప్పే ధైర్యం లేక మంగళవారం ధర్మారంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రెస్‌మీట్ పెట్టి తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అనేక మందిని ఆదుకున్నది, ప్రాణాలు కాపాడిన విషయాలపై లక్ష్మణ్ కుమార్‌కు అవగాహన లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే ప్రధాన పనిగా ఆయన పెట్టుకున్నాడని, అభివృద్ధిపై ప్రశ్నిస్తే వారిపైన దాడులు చేయించడం, లేదంటే పోలీసులతో అక్రమ కేసులు పెట్టించడం లక్ష్మణ్‌కుమార్ ఘనకార్యమని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గంలోని ఆరు సొసైటీలపై ఫిర్యాదు చేస్తే కోర్టు విచారణ జరిపి ఎలాంటి అవకతవకలూ జరుగలేదని మొట్టికాయలు వేసిందని, అయినా బుద్ధి రాలేదన్నారు.
వెల్గటూర్ మండలం చెగ్యాంతో పాటు ఇతర మండలాల్లో కొంతమంది ఎస్సీ, బీసీలు గతం నుంచి సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని తాను ప్రతిపాదిస్తే వాటిని రద్దు చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి నష్టం కలిగించాడాని ఈశ్వర్ ఆరోపించారు. ధర్మపురిలో ట్రాక్టర్ వాళ్లు బీఆర్ఎస్కు మద్దతిస్తే ఆరు నెలలు ట్రాక్టర్లు నడవకుండా చేసి వాళ్ల కడుపు కొట్టింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. పదవిలో ఉన్నానని లక్ష్మణ్ కుమార్ ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో గజం రూ.లక్ష విలువ ఉన్న భూమి వెయ్యి గజాలు ఎలా వచ్చిందని, కరీంనగర్లో కొత్త ఇల్లు ఎలా కడుతున్నావని, హైదరాబాద్‌లో విల్లా ఎలా కొన్నావని నిలదీశారు. నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనైనా తాను ఏ విధంగా అభివృద్ధి చేశానో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఎప్పటికైనా న్యాయం ధర్మమే గెలుస్తుందని చెప్పారు.