పచ్చని పల్లెలో డంప్ యార్డు చిచ్చు చెలరేగింది. ధర్మపురి పట్టణ డంప్ యార్డ్‌ను తిమ్మాపూర్ పంచాయతీ ఆధీనంలోని భూమిలో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఒక వైపు గండి హనుమాన్ ఆలయం, మరో వైపు క్రీడా ప్రాంగణం ఉన్న నేపథ్యంలో గ్రామస్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ విషయంలో ఓ సీనియర్ నాయకుడు ‘అన్నా.. మా ఊరిలో డంప్ యార్డును చేయడం ఏంటి? ఈ నిర్ణయం సరికాదు. వెనక్కి తీసుకోండి’ అని కోరితే.. ‘ఈ నియోజకవర్గం నాది. నా ఇష్టం. ఎక్కడైనా ఏర్పాటు చేసుకుంట. చెప్పడానికి నువ్వెవరు?’ అని మంత్రి సీరియస్ అయినట్టు తెలిసింది. దీంతో ఇరువురి మధ్య విబేధాలు తలెత్తినట్టు సమాచారం కాగా, ఇటు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘మా ఊరిలో ధర్మపురి కంపు ఎందుకు?’ అంటూ పెద్ద సంఖ్యలో జగిత్యాల కలెక్టరేట్‌కు తరలివచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు. డంప్ యార్డు వద్దే వద్దంటూ తెగేసి తెప్పారు. దీంతో వివాదం మరింత ముదరగా, ధర్మపురి, తిమ్మాపూర్ మధ్య వాడీవేడి వాతావరణం నెలకొన్నది. మరో వైపు కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు కీలక నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు ఎటువైపు దారి తీస్తాయోనని ఆ పార్టీ శ్రేణులు కలవరపడుతుండగా.. ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు’ తమ పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన అధికారుల్లో కనిపిస్తున్నది.
జగిత్యాల, జూన్ 8 (నమస్తే తెలంగాణ)/ ధర్మపురి : ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించిన డంప్ యార్డును గోదావరినది సమీపంలో నిర్వహిస్తూ వస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ డంప్ యార్డును అక్కడి నుంచి తరలించాలని మున్సిపల్ పాలకవర్గం ప్రయత్నిస్తున్నది. అయితే ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో శివారు గ్రామాల్లో ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలోనే మున్సిపల్ పాలకవర్గ సభ్యులు.. ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసి డంప్ యార్డును మరో చోటికి తరలించాలని విన్నవించినట్టు తెలుస్తున్నది. దీంతో మంత్రి.. ధర్మపురి రెవెన్యూ అధికారులతో మాట్లాడి, శివారు గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో డంప్ యార్డును ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని సూచించినట్టు సమాచారం. దాంతో రెవెన్యూ అధికారులు డంప్ యార్డు కోసం తిమ్మాపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 266లో ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఎలాంటి పరిశీలన చేయకుండానే స్థలం కేటాయించినట్టు తెలుస్తున్నది. గ్రామపంచాయతీకి కనీస సమాచారం ఇవ్వకుండానే నిర్ణయం ప్రకటించడంపై తిమ్మాపూర్‌వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థలం కేటాయిస్తున్నట్టు కనీసం గ్రామసభ నిర్వహించకపోవడంపై మండిపడుతున్నారు. ప్రతిపాదిత స్థలానికి సమీపంలో గండి హనుమాన్ దేవాలయం ఉందని, అక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేస్తే దుర్వాసన, కాలుష్యంతో పవిత్రతకు భంగం కలుగుతుందని ఆవేదన చెందుతున్నారు. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు సేదతీరే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో సర్వే నంబర్ 266లో ఉన్న ప్రభుత్వ భూమిని గ్రామ పంచాయతీకి కేటాయించారని, అందులో ఉపాధి హామీ నిధులతో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించారని గుర్తు చేశారు. ఇది యువతీ యువకులు, విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నదని చెప్పారు. ఓవైపు క్రీడా ప్రాంగణం, మరోవైపు పవిత్ర ఆలయం ఉన్న స్థలానికి పక్కనే డంప్ యార్డు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు
సర్వే నంబర్ 266లోని భూమిని డంప్ యార్డుకు కేటాయించడాన్ని తిమ్మాపూర్ గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. నాలుగైదు రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రెవెన్యూ అధికారులు స్థల పరిశీలన కోసం గ్రామానికి వచ్చిన సమయంలో వాగ్వాదానికి సైతం దిగారు. రెండు రోజుల క్రితం అధికారులకు ఎదిరి తిరిగి, అక్కడి నుంచి పంపించినట్టు తెలిసింది. ‘అది మా ఊరికి చెందిన భూమి. పంచాయతీకి బదలాయించిన్రు. మేం నిధులు పెట్టి బాగు చేసుకున్నం. ఇప్పుడు ఎలా ఇస్తరు?’ అంటూ ఆగ్రహించడంతో అధికారులు సైతం సైలెంట్ అయినట్టు సమాచా రం. ‘మాకేమి తెలియదు. మంత్రి ఆదేశాల మేరకు మేం కేటాయిం చాం’ అంటూ అధికారులు అక్కడి నుంచి జారుకున్నట్టు తెలిసింది.
మంత్రి, కాంగ్రెస్ నాయకుడి మధ్య విభేదాలు?
డంప్ యార్డు ఏర్పాటుపై అధికారులు నిర్ణయం తీసుకోవడం, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంపై తిమ్మాపూర్ గ్రామస్తులు మండిపడుతున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ మంత్రి తనయుడు, జిల్లాలోని ఒక నియోజకవర్గ ఇన్చార్జి వద్దకు వెళ్లి.. ‘సార్ మన గ్రామానికి అన్యాయం జరుగుతున్నది. మన ఊరు గండి హన్మాండ్ల గుడి దగ్గర, మన ఊరుకు ఇచ్చిన భూమిలో డంప్ యార్డు ఏర్పాటు చేసిన్రు’ అని వాపోయినట్టు తెలిసింది. దీంతో స్పందించిన సదరు నాయకుడు.. మంత్రితోపాటు ఇతర కాంగ్రెస్ నాయకుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు సమాచారం. గుడి, క్రీడా ప్రాంగణం సమీపంలోనే డంప్ యార్డును ఏర్పాటు చేయడం సరికాదని సదరు నాయకుడు వివరించినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అయినా కాంగ్రెస్ పెద్దలతోపాటు మంత్రి సైతం పెడచెవిన పెట్టారని, పైగా ‘నా నియోజకవర్గంలో నేను ఎక్కడైనా ఏర్పాటు చేసుకుంటా. నీకేంటి?’ అంటూ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉందని, నియోజకవర్గం రిజర్వేషన్లు మారే అవకాశాలున్నాయన్న భావనతోనే ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
సహించేది లేదన్న ప్రజానీకం
‘అది మా ఊరి పరిధిలో ఉన్న రెవెన్యూ భూమి. దాన్ని ఐదారేళ్ల క్రితమే మా పంచాయతీకి కేటాయించిన్రు. మేం అక్కడ క్రీడా ప్రాంగణం కట్టుకున్నం. అభివృద్ధి చేసుకున్నం. మాకు అక్కడే హన్మాండ్ల దేవుడు ఉన్నడు. ఇప్పుడు మా అనుమతి లేకుండా, మాకు చెప్పకుండా ధర్మపురి మున్సిపల్ డంప్ యార్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించడం సరికాదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం’ అని గ్రామస్తులు తెగేసి చెప్పారు. సోమవారం పెద్ద సంఖ్యలో జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి తరలివచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ నిధులు వెచ్చించి అభివృద్ధి చేసిన స్థలాన్ని మున్సిపాలిటీకి బదలాయించడం గ్రామపంచాయతీ హకులను కాలరాయడమేనని అధికారులకు వివరించారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, దేవాలయ ప్రాధాన్యత, గ్రామ యువత క్రీడా అవసరాలను దృష్టిలో ఉంచుకొని డంప్ యార్డు కోసం చేసిన స్థల కేటాయింపు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 266 స్థలాన్ని యథావిధిగా తిమ్మాపూర్ గ్రామపంచాయతీ ఆధీనంలో కొనసాగించాలని అదనపు కలెక్టర్‌కు అందజేసిన వినతి పత్రంలో కోరారు.