Odela | ఓదెల, ఫిబ్రవరి 13 : పెద్దపల్లి జిల్లాలోని అతి ప్రాచీన శైవ క్షేత్రమైన స్వయంభు ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వాముల కల్యాణోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం మొక్కిన మొక్కులను నెరవేర్చే కలియుగ దైవం అనునిత్యం వివిధ ప్రాంతాల భక్తుల తాకిడితో నిత్య పూజలు అందుకుంటున్న మల్లన్న కళ్యాణాన్ని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాహలం నడుము ఓదెల మల్లికార్జున స్వామి కళ్యాణం కన్నుల పండువగా సాగింది.
స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు ప్రజా ప్రతినిధులు, వివిధ దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం దృష్టి కుంభం, బలిహరణ విధి, గణపతి పూజ, శివ పుణ్యా వచనం, గౌరీ పూజ, రక్షాబంధనం, అంకురార్పణ, ధ్వజారోహణ, శివయాగ మంటప స్థాపన, రుద్ర హవనము తదితర పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఉదయం 10:30 గంటలకు స్వామివారి కల్యాణం కన్నుల పండువగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే విజయ రమణారావు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. దాదాపు మూడు గంటల పాటు కల్యాణ తంతు వేద పండితులు శాస్త్రోత్వంగా నిర్వహించారు.
వివాహ బంధం గురించి విపులంగా వివరించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం భక్తులందరికీ అన్నదానం చేశారు. కల్యాణ వేడుకలో పాల్గొన్న భక్తులందరికీ ఆలయం తరఫున ప్రసాదం, కండువాలు, జాకెట్ పీసులను పంపిణీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పాలకవర్గం, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. పూజల్లో ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, అడిషనల్ కలెక్టర్ వేణు, మాజీ జడ్పిటిసి గంట రాములు యాదవ్, ఈవో సదయ్య, ఆలయ డైరెక్టర్లు, అధికారులు, సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణాన్ని వేద పండితులు మఠం భవాని ప్రసాద్, పంచాక్షరి, అభిషేక్, మఠం భద్రయ్య, భువనేశ్వర్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్చక బృందం తదితరులు నిర్వహించారు.