వేములవాడ టౌన్, జూన్ 10: ఎములాడ కిక్కిరిసింది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తాకిడి కనిపించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో రాజన్న క్షేత్రం సోమవారం కిటకిటలాడింది. ఉదయాన్నే ధర్మగుండంలో స్నానం చేసిన భక్తులు తలనీలాలు సమర్పించి, కోడె మొక్కు కోసం బారులు తీరారు.
రద్దీ దృష్ట్యా గర్భగుడిలో భక్తులు నిర్వహించుకునే ఆర్జితసేవలను అధికారులు రద్దు చేశారు. స్వామివారిని దాదాపు 40 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారని, ఆలయానికి సుమారు 29 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. కాగా, భక్తులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, అల్లి శంకర్, ఇన్స్పెక్టర్స్ చెక్కిళ్ల అశోక్, సంకెపల్లి పవన్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.