Government schools | పెద్దపల్లి, ఫిబ్రవరి17: ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో పాఠశాలలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన పనులను వేగవంతం చేయాలన్నారు. వర్షాకాలం లోపు గ్రౌండ్ లెవెలింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
రూ.40 లక్షలతో డ్యూయల్ డెస్క్ కొనుగోలు చేశామని, వీటిని విద్యార్థుల సంఖ్య ఆధారంగా సంబంధిత కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలకు కేటాయించాలని సూచించారు. కేజీబీవీలో కిచెన్ ఆధునికరణ కోసం రూ. 20 లక్షల మంజూరు చేశామని తెలిపారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో సీపీవో రవీందర్, డీసీహెచ్వో డాక్టర్ శ్రీధర్, సమగ్ర శిక్ష జిల్లా సమన్వయకర్త పీఎం షేక్, ప్లానింగ్ సెక్టోరియల్ ఆఫీసర్ మల్లేష్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.