Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 8: గోదావరిఖని ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో మళ్లీ కూల్చివేతల శబ్ధం దద్దరిల్లింది. జనమంతా చూస్తుండగానే దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఓల్డ్ అశోక్ సెంటర్లో గల ప్రముఖ వీకే రెడ్డి టీ స్టాల్ నేలమట్టమైంది. దశాబ్దాల చరిత్ర కలిగి ఈ టీ స్టాల్ కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతీ రోజూ ఉదయం, సాయంకాలం వివిధ వర్గాల ప్రజలు ఇక్కడకు చేరుకొని గరం గరం చాయ్ ఆస్వాదిస్తూ మంచి చెడులు మాట్లాడుకుంటారు. వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు, ఇతరులు ఇలా అన్ని వర్గాల వారి మధ్య స్నేహబంధాలను పెంచిన పేరుంది.
ఇక సాయంకాలం అహ్లాదకర వాతావరణంలో అంతా ఇక్కడకే చేరుకుంటారు. ఒకరి సాధక బాధలు ఒకరు తెలుసుకొని గరం చాయ రుచి చూసి కాసేపు ఇక్కడే సేద తిరుతుంటారు. అలాంటి వీకే రెడ్డి టీ స్టాల్ ఇప్పుడు మాయమైంది. బుధవారం రామగుండం నగర పాలక సంస్థ అధికారులు ఆపరేషన్ కూల్చివేతలకు కొనసాగింపు చర్యలు చేపట్టారు. వీకే రెడ్డి టీ పాయింట్ ను ఎక్స్కవేటర్తో నేలమట్టం చేశారు. అక్కడితో ఆగకుండా ఆ ఏరియాలోని మొబైల్ షాపులను సైతం కూల్చివేశారు. అప్పటిదాకా షాపుల్లో ఉన్న వ్యాపారులు కూల్చివేలతో హడలెత్తిపోయారు.
దుకాణాల్లో ఉన్న సామగ్రిని ఆదరబాదరా తీసుకొని బయటకు తరలించారు. ఒకవైపు దుకాణాల నేలమట్టం జరుగుతుండగానే మరోవైపు వ్యాపారులు అందులోని రూ.లక్షల విలువైన సామగ్రిని బయటకు తీసుకవస్తూ నానా తంటాలు పడ్డారు. షాపులోని సామగ్రితో ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. బరువెక్కిన గుండెలతో నిస్సహాయ స్థితిలో వ్యాపారులు ముల్లెమూట సర్దుకొని వెళ్లిపోయారు. చాలా యేళ్లుగా ఇవే దుకాణాలను నమ్ముకొని ఉన్న తాము ఈ చర్యలతో జీవనాధారం కోల్పోయామని కన్నీటి పర్యంతమయ్యారు.
దుకాణాలు నేలమట్టం చేస్తున్నారని విషయం తెలుసుకొన్న బాధితుల కుటుంబ సభ్యులు కూడా హుటాహుటినా అక్కడకు చేరుకొన అవేదన చెందారు. కాగా, రోడ్ల వెడల్పులో భాగంగానే ఈ దుకాణాలు తొలగించాల్సి వచ్చిందని, గతంలోనే వ్యాపారులకు నోటీసులు అందజేసి గడువు ఇచ్చామని, ప్రస్తుతం రోడ్ల వెడల్పు పనులు సమీపంలోకి రావడంతో ఈ చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. కాగా తమకు ప్రత్యమ్నాయ ఆధారం చూపాలని బాధితులు వేడుకున్నారు.