గంగాధర/ మానకొండూర్, మే 21 :అన్నదాత కోసం బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. రైతన్నను వంచించిన కాంగ్రెస్‌పై మరోసారి యుద్ధభేరి మోగించింది. ఎన్నికల ముందు వరకు అన్నిరకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని నమ్మించి, ఇప్పుడు సన్నరకం వడ్లకు మాత్రమే ఇస్తామని ఇటీవల రేవంత్ రెడ్డి, తాజాగా మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నది. పార్టీ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో రైతులతో కలిసి ఆందోళనకు దిగింది. రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేసింది. పలుచోట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలిపింది. నిన్నటి దాకా సాగునీరివ్వక సావగొట్టిందని, కరెంటు కోతలతో పంటలను ఎండగొట్టి, కష్టించి పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనక అకాల వర్షాల పాలు చేసిందంటూ మండిపడింది. ఇది ప్రజా ప్రభుత్వం కాదని, ప్రజావ్యతిరేక ప్రభుత్వమని ధ్వజమెత్తింది. సన్నవడ్లకే కాదు, అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేసింది. లేదంటే ఊరుకునేది లేదని, పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.