చొప్పదండి, జనవరి 7 : రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమన్నది. మూడు రోజులుగా చేపడుతున్న ఆందోళనల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, వినూత్న నిరసనలతో హోరెత్తించింది. ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసింది. లేకుంటే కాంగ్రెస్‌ను ప్రజలు తరమికొడతారని హెచ్చరించింది.
కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎన్టీఆర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత రైతులతో కలిసి పొలంలోకి దిగి నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్ల కండువాలు ధరించి మహిళా కూలీలు, రైతులు, కార్యకర్తలతో కలిసి పొలంలో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు.
అనంతరం వాడవాడలా ద్విచక్ర వాహన ర్యాలీ తీసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణచౌక్‌లో వేములవాడ రూరల్ బీఆర్ఎస్ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు.