గంగాధర, నవంబర్ 5: కాంగ్రెస్ సర్కారుపై రైతులు కన్నెర్ర జేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై కడుపుమండి రణానికి దిగుతున్నారు. కేంద్రాలకు వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టిన పాపాన పోకపోవడంతో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. మంగళవారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ధర్నా, రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
కాగా, ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి గంగాధర ఠాణాకు తరలించగా, ఇదేం పద్ధతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు రైతులను అరిగోస పెడుతున్నదని, కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఒక్క గింజ కొనకుండా వేధిస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీకి రూపులేకుండా పోయిందని, రైతు భరోసా జాడలేదన్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనేవారే లేరన్నారు.
ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరతో ధాన్యం కొనే దాకా బీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మేచినేని నవీన్‌రావు, సాగి మహిపాల్‌రావు, ఐలినేని సాగర్‌రావు, చిలుక రవీందర్, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, ఆకుల మధుసూదన్, జనగం శ్రీనివాస్, కంకణాల విజేందర్‌రెడ్డి, మడ్లపెల్లి గంగాధర్, వేము దామోదర్, దూలం శంకర్‌గౌడ్, వేముల అంజి, బందారపు అజేయ్, నజీర్, చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సర్కారు వచ్చినంక రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానంటే నిజమని నమ్మి ఓట్లేసినం. ఆగస్టు 15లోపల మాఫీ చేస్తామంటే సంబురపడ్డం. కానీ నేను తీసుకున్న రూ.2 లక్షల లోన్ మాఫీ కాలేదు. ఆఫీసులు, సార్ల చుట్టూ తిరిగినా ఎందుకు మాఫీ కాలేదో చెప్పుతలేరు. ఇగ అత్తయి అగ అత్తయని అంటుర్రు. రుణమాఫీ చెయ్యలేదు, రైతు భరోసా రాలేదు, వడ్లు కొంటలేరు. ఇన్ని రకాలుగా మా రైతులను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తరో తెలుస్తలేదు.
– బట్టు మల్లయ్య, రైతు
కేసీఆర్ సారు ఉన్నప్పుడే మంచిగుండేది. దుక్కులు దున్నేటప్పుడే రైతు బంధు వేసిండు. సాగుకు పుష్కలంగా నీళ్లు అత్తుండే. కేంద్రాలను చాల్జేసి జెప్పన వడ్లు కొనేటోళ్లు. ఏ కష్టం లేకుండా అమ్ముకునేటోళ్లం. కాంగ్రెస్ సర్కారు వచ్చినంక మొత్తం తిర్రమర్ర అయ్యింది. రైతులను ముంచుడే తప్ప మంచి చేసేటోళ్లు లేకుండా పోయిన్రు. ఇప్పటికైనా వడ్లు కొనాలే.
– ద్యాగల ముత్తయ్య, రైతు