Godavarikhani | కోల్ సిటీ , మే 11: రామగుండం నగర పాలక సంస్థకు చెందిన ఓ కాంట్రాక్టర్ నిర్వాకం ఆ కాలనీ ప్రజలకు శాపంగా పరిణమించింది. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, ప్రణాళికబద్ధంగా నిర్మాణం చేపట్టకపోవడం వల్ల స్థానికులు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నట్లు ఆరోపిస్తున్నారు. స్థానిక 29వ డివిజన్ పరిధిలోని జీఎం కాలనీ ఏరియాలో నెల రోజుల క్రితం సిమెంట్ నిర్మాణం పూర్తి చేశారు.
ఐతే ఆ పనులు చేపట్టిన మున్సిపల్ కాంట్రాక్టర్ ఆ ప్రాంతంలో ఉన్న చర్చికి దారి కోసం అనుకూలంగా రోడ్డు ఎత్తు పెంచి నిర్మించడం వల్ల ఎదురుగా వినాయక మండపం దిగువకు కావడంతో రోజు రోజుకూ వృథా నీరు నిలిచి ప్రస్తుతం చిన్నపాటి చెరువుగా మారుతోంది. దీంతో పారిశుధ్యం లోపించి దోమలు వృద్ధి చెందుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు.
కాంట్రాక్టర్ నిర్వాకంతో రాకపోకలకూ ఇబ్బందికరంగా మారడంతోపాటు దుర్గంధం వెదజల్లడం వల్ల ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు ఆ రోడ్డును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే వర్షాకాలంలో మురికి నీరు ఇండ్లలోకి వచ్చే ప్రమాదం ఉంటుందని వాపోతున్నారు.