జగిత్యాల, ఏప్రిల్ 2 : కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, ఇది ప్రజలు, మూగజీవాలను హింసించే పాలన అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు. పదహారు నెలల రేవంత్ రెడ్డి పాలనలో విధ్వంసంతప్ప అభివృద్ధిలేదని మండిపడ్డారు. హెచ్‌సీ యూ విద్యార్ధులపై జరిగిన లాఠీచార్జిని ఖండించారు. ఈమేరకు బుధవా రం ఒక ప్రకటన విడుదల చేశారు. పచ్చని అడవిని నాశనం చేయద్దని నిరసనకు దిగిన హెచ్‌సీయూ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రకృతిని, వన్యప్రాణులను సంరక్షించుకు నే బాధ్యత మనందరిపైనే ఉందని చెప్పారు. హైదరాబాద్‌కు ప్రాణవాయువు అయినటువంటి 400ఎకరాల భూమిని అమ్మి పార్టీ అధిష్టానానికి కప్పం కట్టేందుకు రేవంత్ సర్కారు చూస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ నీచమైన ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజానీకం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని చేతి లో పట్టుకొని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతూ దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీకి హెచ్‌సీయూలో బుల్డోజర్లతో చేస్తున్న విధ్వంసం కనపడడం లేదా అని ప్రశ్నించారు.