కొడిమ్యాల, సెప్టెంబర్ 6 : “యూరియా అందక పంట పొలాలు కరాబ్ అవుతున్నయ్. యూరియా ఇప్పించి పంటలను కాపాడండి సార్..” అంటూ మండలంలోని దమ్మయ్యపేట గ్రామస్తులు కలెక్టర్ సత్యప్రసాద్కు మొరపెట్టుకున్నారు. శనివారం ఆయన గ్రామానికి వచ్చి, తిరిగి వెళ్తుండగా గ్రామస్తులు ఆపి సమస్యలు విన్నవించారు. గతంలో ఏ ఫర్టిలైజర్ షాపులో అయినా యూరియా దొరికేదని, ప్రస్తుతం ఒక్క బస్తా కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని విన్నవించారు. యూరియా ఇప్పించాలని వేడుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని కలెక్టర్ చెప్పారు.
రైతుల శాపనార్థాలు
కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబర్ 6: కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి, పెగడపల్లి డీసీఎంఎస్ గోదాంలకు శనివారం యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు ఉదయాన్నే రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పెగడపల్లి డీసీఎంఎస్కు 270 బస్తాలు రాగా, 350 మంది చెప్పులు క్యూలో పెట్టి వేచిచూశారు. ఒక్కొక్కరి ఒక బస్తా మాత్రమే పంపిణీ చేయడంతో 70 మంది వెనుదిరిగారు. వెన్నంపల్లి డీసీఎంఎస్కు 240 బస్తాలు రాగా, సుమారు 400 మంది పడిగాపులు గాశారు. ఒక్కొక్కరికి ఒక్క బస్తా మాత్రమే పంపిణీ చేయడంతో 160 మంది ఇంటిబాట పట్టారు. గత ప్రభుత్వంలో ఇలాంటి బాధలు ఎన్నడూ రాలేదని, యూరియా సరిపడా అందించకుండా తమను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ సర్కారు పుట్టగతులు ఉండవని రైతులు శాపనార్థాలు పెట్టారు. నాట్లేసి రెండు నెలలవుతున్నదని, యూరియా వేయకపోతే పంట దక్కేటట్లు లేదని, వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.
కొరత మాటున సర్కారు దోపిడీ
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 6: కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు అరిగోసపడుతుండగా, ఇదే అదనుగా సర్కారు దోపిడీకి పాల్పడుతున్నది. రైతు జేబుకు చిల్లు పెడుతున్నది. బస్తాపై అదనంగా రూ.35 వసూలు చేస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేశవపెరుమాండ్ల స్వామి ఆలయం సమీపం వద్ద మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐకేపీ గోదాములో శనివారం యూరియా పంపిణీ చేశారు. రైతుకు రెండు బస్తాల చొప్పున మొత్తం 550 బస్తాలు అందజేశారు. అయితే బస్తాకు రూ.265 తీసుకోవాల్సిన నిర్వాహకులు అదనంగా రూ.35 వసూలు చేశారు. ఎల్లారెడ్డిపేట ఏఈవో శ్రీశైలం కండ్ల ముందే దోపిడీకి పాల్పడగా, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. పై అధికారుల ఆదేశాల మేరకు తీసుకుంటామని, ట్రాన్స్పోర్టు ఖర్చులు అని చెప్పడం కొసమెరుపు. అసలే యూరియా కొరతతో ఇబ్బందులు పడుతుంటే అదనపు వసూళ్లు సరికాదని రైతులు లబోదిబోమన్నారు.
క్యూలో జిరాక్సులు పెట్టి నిరీక్షించినా..
సారంగాపూర్, సెప్టెంబర్ 6 : సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయానికి రైతులు శనివారం ఉదయమే తరలివచ్చి తమ పట్టదార్ పాస్ పుస్తకం జిరాక్స్లు క్యూలో పెట్టి యూరియా కోసం నిరీక్షించినా కొందరికి యూరియా అందలేదు. ఇక్కడ 450 బస్తాలు పంపిణీ చేయగా, మరికొంత మంది అందలేదు. దీంతో వారికి సీరియల్ ప్రకారం ఆదివారం అందజేస్తామని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు.