వీణవంక, సెప్టెంబర్ 25: దొంగ హామీలు, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు అర్హులందరికీ రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. రైతుభరోసా, కొత్త పింఛన్లు ఇంకెప్పుడిస్తారని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్టు జాడేలేదన్నారు. బుధవారం ఆయన వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా దేశాయిపల్లిలో మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమారు 5వేల కుటుంబాలకు వెంటనే రెండో విడుత దళితబంధు నిధులు ఇవ్వాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మహిళలకు ప్రతినెలా 2,500 ఇవ్వాలని, వెంటనే 2లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేశారు. కల్వల ప్రాజెక్ట్ పనులు చేపట్టి వీణవంక, జమ్మికుంట, శంకరపట్నంలోని రైతులకు మేలు చేయాలని రైతుల పక్షాన దండంపెట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హామీలు అమలు చేయకపోతే దసరా తర్వాత రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మాజీ సర్పంచులు మోరె సారయ్య, పోతుల నర్సయ్య, కోమాల్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, నాయకులు సమ్మిరెడ్డి, తిరుపతి, రవీందర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, ముత్యాల శంకర్, రాపర్తి అఖిల్, రాజయ్య, దరిపెల్లి రవి, మల్లారెడ్డి, అజయ్, చరణ్ పాల్గొన్నారు.