– ఎటువంటి అనుమతులు లేకుండానే నరికివేత?
– ఎంఈఓ మాటలు బేకాతర్
కారేపల్లి, ఫిబ్రవరి 11 : పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా ప్రభుత్వం లక్షలాది రూపాయలు హరితహారం పేరుతో ఖర్చు చేస్తుంటే మరొకవైపు ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లను తొలగిస్తున్న వైనం ఇది. చెట్లు తొలగించాలంటే అటవీ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయిందనే చందాగా పాఠశాల ప్రహరీ కోసమని పాఠశాల హద్దుపై ఉన్న చెట్టును నరికేస్తే ఆ చెట్టు పూర్తిగా స్కూల్ బిల్డింగ్ పై ఒరిగి స్లాబ్ కు నష్టం చేకూర్చిన ఘటన సింగరేణి మండలం రావోజితండా గ్రామ పంచాయతీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రావొజీతండా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బిల్డింగ్ ఉంది. అయితే స్కూలుకు సంబంధించి ప్రహరీ ఏర్పాటుకు ఇటీవల రూ.5 లక్షలు మంజూరు అయ్యాయి. పాఠశాల హద్దులపై చెట్లు ఉన్నాయి. విద్యార్థులకు చల్లదనం ఉండాలని సంకల్పంతో కొన్ని సంవత్సరాల క్రితం ఆ చెట్లను నాటారు. కాగా గోడ నిర్మాణాన్ని చేపట్టిన వ్యక్తి చెట్లను తొలగించే ప్రక్రియ ప్రారంభించాడు.
అందులో ఒక పెద్ద వృక్షం నరకడానికి స్థానిక ఎంఈఓ జయరాజుకు తెలుపగా ఎంపీడీఓ ఇతర అధికారుల అనుమతి తీసుకొని చెట్టు తొలగించాల్సి ఉంటుందన్నారు. అయితే ఎవరి అనుమతి తీసుకోకుండానే మంగళవారం సాయంకాలం చెట్టును నరికి వేసే క్రమంలో ఆ చెట్టు కాస్త స్కూల్ బిల్డింగు పై పడిపోయింది. దీంతో స్కూల్ బిల్డింగు స్లాబ్ పై భాగంలో కొంతమేర దెబ్బతిన్నది. ఈ విషయమై ఎంఈఓ జయరాజు ను నమస్తే తెలంగాణ వివరణ కోరగా చెట్లను తొలగించమని తాము చెప్పలేదని, అధికారుల అనుమతి తీసుకోవాలని చెప్పినా సంబంధిత వ్యక్తులు వినిపించుకోలేదన్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అయితే చెట్లు తొలగించిన వ్యక్తి హడావుడిగా గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్లుగా అనుమతి తీసుకోవడం కొసమెరుపు.