దళితబంధు రెండో విడుత ఆర్థికసాయం అందించాలని లబ్ధిదారులు ఎన్ని విజ్ఞప్తులు, విన్నపాలు చేసినా సర్కారు కరగకపోవడంతో ఇక ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు. హుజూరాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులను సమీకరించి పోరాడేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. శనివారం హుజూరాబాద్‌లో జరిగిన ఘటనతో తమ ఉద్యమం కీలక స్థాయికి చేరుకున్నదని భావిస్తున్న వారు నిరంతర ఉద్యమాలతోనే రెండో విడుత ఆర్థికసాయం సాధించుకుంటామనే ధీమాకు వచ్చారు.
-కరీంనగర్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ)
గత ప్రభుత్వం అమలు చేసిన దళితబంధు పథకానికి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా, గత అసెంబ్లీ ఎన్నికల వరకు 9,873 మందికి పూర్తి స్థాయిలో ఆర్థికసాయం అందింది. ఇంకా 8,148 మందికి వివిధ స్థాయిలో అందాల్సి ఉంది. రెండో విడుత అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తుండగానే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో దళిత బంధు ఖాతాలు ఎన్నికల కమిషన్ ఆంక్షలకు గురయ్యాయి.
నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో 6,868 మందికి సంబంధించిన రూ.256.76 కోట్లు, హన్మకొండ జిల్లా పరిధిలోని కమలాపూర్‌లో 1,280 మందికి రూ.14.83 కోట్లు, మొత్తం 8,148 మంది లబ్ధిదారులకు రూ. 271.60 కోట్లు రావాల్సి ఉంది. అయితే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత బంధు ఖాతాలపై ఫ్రీజింగ్ విధించింది. ఒక్క రూపాయి కూడా విడిపించుకునేందుకు వీలు లేకుండా అధికారులకు పక్కా ఆదేశాలు జారీ చేసింది.
దళిత బంధు రెండో విడుత కోసం లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారు. పది నెలలుగా ఇటు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అధికారులకు విజ్ఞప్తులు చేయడం, అటు మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి తమ గోడు వెల్లబోసుకోవడం సర్వసాధారణమైంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్, జమ్మికుంట, తదితర ప్రాంతాల్లో దళితులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణిలో అనేకసార్లు దరఖాస్తులు ఇచ్చారు. నిరసనలకు దిగినా ప్రభుత్వం దిగి రాకపోగా, లబ్ధిదారులపై పోలీసు నిఘా పెంచి ముందస్తు అరెస్టులు చేస్తూ అక్రమంగా కేసులు పెడుతోంది.
ఆందోళనల్లో చురుకుగా పాల్గొంటున్న కొందరు దళితులను పోలీసులు వేటాడినంత పని చేస్తున్నారు. ఇంటిలిజెన్స్ డేగ కన్ను వేసి వీరి కదలికలను పసిగడుతోంది. ఎప్పుడు ఆందోళనకు దిగితే అప్పుడు రెండు రోజులు ముందుగానే అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు. కనీసం భోజనం, మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా రోజుల తరబడి స్టేషన్లలో ఉంచుకుంటున్నారని అరెస్ట్ లకు గురైన దళితులు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం హుజూరాబాద్‌లో జరిగిన ఆందోళన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని దళిత బంధు సాధన సమితి నిర్ణయించుకున్నది. ఈ క్రమంలో ఇప్పటికే గ్రామ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకున్న దళితులు అవసరమైతే ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేస్తున్నారు.
అందులో భాగంగా రాష్ట్ర స్థాయి కార్యాచరణ కమిటీని కూడా ఏర్పాటు చేసుకునే ఆలోచనలో కనిపిస్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే ఆలోచన చేస్తున్నారు. తమకు మద్దతు ఇచ్చే ఏ పార్టీ సహాయానైనా తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగానే హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మద్దతు తీసుకున్నామని దళితులు చెబుతున్నారు.
దళితబంధు రెండో విడుత ఆర్థిక సహాయాన్ని సాధించుకునే వరకు విశ్రమించం. ప్రభుత్వం ఎంత నిర్భందం విధించినా, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసినా ఇక నుంచి మేం చలించం. మా పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా పట్ల న్యాయం ఉన్నది. మా ఖాతాల్లో ఉన్న డబ్బులు విడిపించుకునేందుకు మాకు అవకాశం ఇవ్వండి అని మాత్రమే అడుగుతున్నాం. ఇది తప్పన్నట్లు ప్రభుత్వం మాపై అణచివేతకు పాల్పడుతోంది. ఇప్పుడు ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఈ ఆందోళనలు చేస్తున్నాం. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు ఇక్కడి నుంచే కార్యాచరణ రూపొందించుకుంటున్నం.
– కొలుగూరి సురేశ్, దళిత బంధు సాధన సమితి బాధ్యుడు