GP building | పెద్దపల్లి, ఆగస్టు25: గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని పాలకుర్తి మండలం బసంత్ నగర్ గ్రామానికి చెందిన తువ్వ సతీష్ యాదవ్ సోమవారం బసంత్‌నగర్ నుంచి కలెక్టరేట్ వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. కలెక్టరేట్ చేరుకున్న ఆయన గ్రామస్తులతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం సమర్పించారు.
ఈ మేరకు సతీష్ యాదవ్ మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న బసంత్‌నగర్ గ్రామ పంచాయతీ భవనాన్ని గత ప్రభుత్వ హాయంలో కూల్చేసి కొత్త జీపీ భవనానికి ముగ్గు పోశారని, ఈ భవన నిర్మాణానికి నిధులు కూడా మంజైరైనట్లు తెలిపారు. కానీ నిర్మాణానికి నోచుకోలేదని, కొందురూ ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కూలగొట్టిన చోటే కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్‌తో పాటు మాజీ ఎంపీటీసీ రవీందర్, గ్రామస్తులు ప్రసాద్, రాయమల్లు, శైలజ, మల్లమ్మ, సుశీల, పుష్పలత, సంపత్ తదితరులు పాల్గొన్నారు.