Cycle rally | హుజురాబాద్ రూరల్, అక్టోబర్ 28 : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ ఏసీపీ మాధవి పచ్చ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో పాటు హుజురాబాద్ కు చెందిన పలువురు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ హుజురాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి జమ్మికుంట ప్రధాన రహదారిలో రాజపల్లి మీదుగా వెళ్లి తిరిగి హుజురాబాద్ పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించారు.
అనంతరం ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దైనందన జీవితంలో వ్యాయామం తప్పనిసరిగా చేయాలని అన్నారు. వ్యాయామంతో ఎటువంటి రుగ్మతలనైనా తగ్గించుకోవచ్చని అన్నారు. అలాగే ఈనెల 30న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నామని, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. రక్త దానం వల్ల పోలీసులకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సీఐ కరుణాకర్, రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట సీఐ రామకృష్ణ, జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, హుజురాబాద్ ఎస్సైలు యూనస్ అహ్మద్ అలీ, సైదాపూర్ ఎస్సై తిరుపతి, పోలీసు సిబ్బంది తో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.